Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన

  • భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
  • దాదాపు పూర్తయినట్లు వెల్లడి
  • 2025లో ప్రారంభమైన చర్చలు
Piyush Goyal

Piyush Goyal

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయిందని తెలిపారు. అయితే భారత ఎగుమతిదారులకు పోటీ దేశాలతో పోలిస్తే టారిఫ్ పరంగా ప్రయోజనం కల్పించే అంశంపై ఇరు దేశాలు ఇంకా కసరత్తు చేస్తున్నాయని చెప్పారు. ఆ ప్రయోజనానికి సంబంధించిన వ్యవస్థను ఖరారు చేసిన వెంటనే ఒప్పందాన్ని అమలు చేయడానికి మార్గం సుగమమవుతుందని వెల్లడించారు.

అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడాల్సి ఉంటుంది. అందువల్ల కేవలం టారిఫ్‌ను తగ్గించడం కాకుండా.. పోటీ దేశాలకు లభిస్తున్న రేట్లతో పోలిస్తే భారత్‌కు ప్రయోజనకరమైన రేటు ఉండాలని కేంద్రం కోరుతోంది. వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోలిస్తే భారత ఎగుమతిదారులకు మెరుగైన మార్కెట్‌ ప్రాప్యత కల్పించడమే ఈ చర్చల్లో ముఖ్యమైన అంశంగా ఉంది.

2025లో ప్రారంభమైన చర్చలు

విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్‌, అమెరికా 2025 ఫిబ్రవరిలో చర్చలు ప్రారంభించాయి. మార్కెట్‌ యాక్సెస్‌, టారిఫ్‌లు, నాన్‌-టారిఫ్‌ అడ్డంకులు, డిజిటల్‌ వాణిజ్యం, సరఫరా గొలుసుల స్థిరత్వం తదితర అంశాలు చర్చల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఒప్పందంలోని ప్రధాన అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన ఏర్పడినప్పటికీ.. భారత ఎగుమతులకు పోటీ ప్రయోజనం కల్పించే టారిఫ్‌ వ్యవస్థను ఖరారు చేయడం కీలకంగా మారింది. ఇదే సమయంలో రష్యాపై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్న నేపథ్యంలో గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా నుంచి గణనీయంగా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే చట్టంపై సెప్టెంబర్‌ 18న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ చట్టం వల్ల భారత్‌పై పడే ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అమెరికా చర్యల నేపథ్యంలో ఇరు దేశాల వాణిజ్య చర్చలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.