Site icon NTV Telugu

Ajit Pawar Plane Crash: పైలట్ సుమిత్ కపూర్ స్నేహితులు సంచలన వ్యాఖ్యలు

Ajitpawar2

Ajitpawar2

బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ముగ్గురు పైలట్లు, వ్యక్తిగత కార్యదర్శి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అందరూ కాలిపోయారు.

అయితే తాజాగా కెప్టెన్ సుమిత్ కపూర్‌‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమిత్ కపూర్ స్నేహితులు కీలక విషయాలను మీడియాతో పంచుకుని దు:ఖించారు. వాస్తవంగా ఆరోజున విమానాన్ని సుమిత్ కపూర్ నడపకూడదని.. వేరొక పైలట్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో సుమిత్ కపూర్ వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న మరో పైలట్ స్థానంలో కెప్టెన్ సుమిత్ కపూర్ బాధ్యత వహించాల్సి వచ్చిందని స్నేహితులు అన్నారు. కొన్ని రోజుల క్రితమే సుమిత్ హాంకాంగ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. కేవలం కొన్ని గంటల ముందే అజిత్ పవార్‌తో కలిసి బారామతికి విమానాన్ని నడపాలని ఆదేశాలు అందుకున్నాడని గుర్తుచేశారు. విమానం నడపడంలో సుమిత్‌కు చాలా అనుభవం ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేసే అవకాశమే ఉండదని పేర్కొన్నారు. అయినా కూడా ఈ ప్రమాదపై దర్యాప్తు చేయాలని స్నేహితులు డిమాండ్ చేశారు.

కెప్టెన్ సుమిత్ కపూర్ చాలా దయగల వ్యక్తిగా అభివర్ణించారు. అన్నింటికంటే ఎక్కువగా విమాన ప్రయాణాన్నే ఇష్టపడేవాడని.. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేసి ఉండడని కచ్చితంగా చెప్పారు. సుమిత్ కుమారుడు, కూతురు ఇద్దరూ వివాహితులని.. కొడుకు, అల్లుడు ఇద్దరూ కూడా పైలట్లేనని వెల్లడించారు. ఇక గురుగ్రామ్‌లో వ్యాపారవేత్త అయిన సోదరుడు కూడా ఉన్నాడని తెలిపారు.

సుమిత్ కపూర్ స్నేహితుడు సచిన్ తనేజా మాట్లాడుతూ.. మణికట్టు మీద ధరించిన బ్రాస్లెట్ ద్వారా కెప్టెన్ మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు. మరో స్నేహితుడు నరేష్ తనేజా మాట్లాడుతూ.. ప్రమాదం గురించి విన్నప్పుడు కపూర్ చనిపోయాడని నమ్మలేకపోయామని చెప్పాడు. మరో స్నేహితుడు జీఎస్ గ్రోవర్ మాట్లాడుతూ.. కపూర్ హాంకాంగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనతో చాలా సేపు మాట్లాడాడని.. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తనకు సూచించాడని చెప్పాడని గుర్తుచేశాడు.

బుధవారం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. అయితే విమానం ల్యాండింగ్ సమయంలో విజిబులిటీ సరిగా లేదు. దీంతో ల్యాండింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. మొదటి ల్యాండింగ్ విఫలం అయిన తర్వాత.. రెండో ల్యాండింగ్ సమయంలో రన్‌వే ఏ మాత్రం కనిపించలేదు. దీంతో పొరపాటున ఎయిర్‌పోర్టుకు 100 మీటర్ల దూరంలో ల్యాండింగ్ అవ్వడంతో కూలిపోయింది. విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, పైలట్ సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దర్యా్ప్తు చేస్తోంది. ఇక గురువారం బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రి నారా లోకేష్, పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు.

Exit mobile version