Yogi Adityanath: మహా కుంభమేళా ముగింపుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ఈ కార్యక్రమం పూర్తవుతోంది. తాజాగా, మహా కుంభమేళాపై విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళా అనేది ప్రజలు కోరికలు కోరుకునే ఒక నిధి అని ఆయన అన్నారు. ‘‘రాబందులకు శవాలు వచ్చాయి, పందులకు మురికి లభించింది. అయితే మంచి వ్యక్తులకు సంబంధాల అందమైన చిత్రం లభించింది. వ్యాపారులకు వ్యాపారం లభించింది. భక్తులకు శుభ్రమైన ఏర్పాటు లభించాయి’’ అని యోగి అన్నారు.
కుంభమేళ తొక్కిసలాటలో 18 మంది భక్తులు చనిపోయిన తర్వాత ప్రతిపక్షాలు యూపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి. ‘‘ఒక నిర్దిష్ట కులం అక్కడికి వెళ్లకుండా ఆపారని మీరు (ప్రతిపక్షం) ఆరోపించింది. ఏ కులాన్ని కూడా ఆపలేదు. మంచి ఉద్దేశ్యంతో ఉన్న వారు ఎవరైనా కుంభ్‌కి గౌరవంగా వెళ్లాలి. కానీ చెడు ఉద్దేశ్యంతో అక్కడికి వెళ్లే వారు, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నష్టపోతారు’’అని యోగి ఆదిత్య నాథ్ అన్నారు.
Read Also: PM Modi: లాలూ ‘‘జంగిల్ రాజ్’’ నేత.. బీహార్ ఎప్పటికీ వారిని క్షమించదు..
‘‘మేము మీలా భక్తుల విశ్వాసాలతో ఆడుకోలేదు. మీ కాలం(సమాజ్‌వాదీ పార్టీ పాలన)లో ముఖ్యమంత్రి(అఖిలేష్ యాదవ్) కార్యక్రమాన్ని చూడలేదు, కనీసం సమీక్షించలేదు. హిందూ మతానికి చెందని(ఆజాంఖాన్)కి కుంభమేళా బాధ్యతలు అప్పగించారు’’ అని అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు చేశారు. ‘‘కానీ ఇక్కడ నేను స్వయంగా కుంభ్‌ని సమీక్షిస్తున్నాను. 2013లో కుంభ్‌కు వెళ్ళిన వారందరికీ గందరగోళం, అవినీతి, కాలుష్యం కనిపించడానికి ఇదే కారణం. గంగా, యమునా మరియు సరస్వతి నదుల త్రివేణిలో స్నానం చేయడానికి నీరు సరిపోలేదు. స్నానం చేయడానికి నిరాకరించిన మారిషస్ ప్రధానమంత్రి దీనికి ఉదాహరణ’’ అని యోగి ఆదిత్యనాథ్ అప్పటి అఖిలేష్ యాదవ్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.
కుంభమేళాని ఉద్దేశించి పలువురు ప్రతిపక్ష నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడుతూ..గంగలో స్నానం చేస్తే పేదరికం పోతుందా.? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ‘‘గంగలో శవాలు పారేస్తున్నారు’’ అని ఆరోపించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుంభమేళాని ‘‘మృత్యుకుంభ్’’గా పిలిచారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుంభ్‌ని ‘‘పనికిరానిది’’గా కొట్టిపారేశారు. ఈ విమర్శల నేపథ్యంలో యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.