Tamil Nadu Deepam Row: తమిళనాడులోని తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదం, ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మద్రాస్ హైకోర్టు కొండపై ఉన్న ఆలయం వద్ద దీప వెలిగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. దీంతో భక్తులు బలవంతంగా కొండపైకి వెళ్లి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
ఇదిలా ఉంటే, ఈ వివానానికి కారణంగా ఉన్న దర్గాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దర్గాలో ‘కంతురి’ ఉత్సవాన్ని అనుమతించవద్దని కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. ఇదే దర్గాకు సమీపంలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొండపై జంతుబలిని నిషేధిస్తున్నాయని పిటిషనర్ వాదించారు. ఈ ఉత్సవాన్ని అనుమతిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ పేర్కొన్నారు.
విజయనగర పాలకుడు కుమార కంపనపై మధురై నగరం కోసం పోరాడుతూ మరణించిన సుఫీ సాధువు సుల్తాన్ సికిందర్ బాదుషా సమాధి ఈ దర్గాలో ఉంది. ఈ దర్గా నిర్వాహకులు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయలేదని, ఉత్సవాన్ని నిర్వహించుకునే హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించలేదని పిటిషన్ కోర్టుకు తెలిపారు. తాత్కాలిక ఉపశమనం కోరుతూ, రిట్ పిటిషన్ పరిష్కారమయ్యే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, జస్టిస్ జ్యోతి రమణ ఈ అభ్యర్థనను తిరస్కరించి, దర్గా నిర్వాహకులకు నోటీసు జారీ చేస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కేసు జనవరి 2కు వాయిదా పడింది.
ఆదివారం దర్గాలో సంతనకూడు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత ఈ పిటిషన్ వచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే కొంత మంది స్థానికులు కొండపైకి ఎక్కి దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని, దర్గా వద్ద వేడుకలకు సంబంధించి ఏర్పాట్లకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే, హిందువుల హక్కుల్ని డీఎంకే అణిచివేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
