NTV Telugu Site icon

Jagdeep Dhankhar: రాజ్యాంగ పదవిలో ఉండీ ఆర్థిక వ్యవస్థ నాశనానికి ప్రయత్నం.. రాహుల్ గాంధీని ఉద్దేశించేనా..?

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar: భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ‘‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి’’ ప్రయత్నిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్‌ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల హిండెన్‌బర్గ్ ఓ రిపోర్టుని విడుదల చేసింది. ఆమెకు అదానీ గ్రూపులో షేర్స్ ఉన్నాయని ఆరోపించింది.అయితే, ఈ ఆరోపణల్ని సదరు కంపెనీ తిప్పికొట్టింది. బీజేపీ నేతలు కూడా ఈ రిపోర్టును కొట్టిపారేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు కొందరు విదేశీ శక్తులతో చేతులు కలిపి పనిచేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

Read Also: Ricky Ponting: కోహ్లీ కాదు.. సచిన్‌ ప్రపంచ రికార్డు అతడే బద్దలు కొడతాడు: పాంటింగ్‌

శుక్రవారం నేషనల్ లా యూనివర్శిటీ (ఎన్‌ఎల్‌యు)లో న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ధన్‌ఖర్ మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ఒక కథనాన్ని తీసుకువచ్చారని దీని గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని అన్నారు. “గత వారంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బాగా ప్రచారం పొందిన మీడియాలో ప్రకటించినప్పుడు నేను చాలా ఆందోళన చెందాను. మన ఆర్థిక వ్యవస్థ నాశనం చేసే కథనానికి మద్దతు ఇస్తూ, సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలని అభ్యర్థించిన సమయంలో నేను చాలా ఆందోళన చెందాను’’ అని ధన్‌ఖర్ అన్నారు.

దేశ శ్రేయస్సు కంటే పక్షపాతం మరియు స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే శక్తులను తుదముట్టించాలని ఆయన యువతను కోరారు. మన దేశం కంటే పక్షపాత్రం, స్వప్రయోజనాలు ఎక్కువగా భావించే శక్తుల్ని తిప్పికొట్టాలని సూచించారు. గతంలో హిండెన్ బర్గ్ నివేదికను ప్రస్తావిస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరాడు. రాహుల్ గాంధీ పేరుని తీయకుండా ధన్‌ఖర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.