Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్‌స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!

  • యూట్యూబ్, ఇన్‌స్టాలో కోట్ల ఫాలోవర్లు ఉన్న పవన్ సాహూకు షాక్..
  • భార్యను ఎన్నికల్లో గెలిపించుకోలేని వైనం..
  • మూడో స్థానానికి పరిమితమైన కోమల్ సాహూ..
Pawan Sahu

Pawan Sahu

Pawan Sahu: సోషల్ మీడియా పాపులారిటీ ప్రజాక్షేత్రంలో గెలిపించడని చాలాసార్లు రుజువైంది. మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, సొంత భార్యను ఎన్నికల్లో గెలిపించలేకపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పవన్ సాహూ తన భార్య కోమల్ సాహూను సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టినా, గెలిపించలేకపోయాడు. కోమల్‌కు మొత్తం 277 ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడోస్థానానికి పరిమితమైంది.

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా, షాపురా ఉపవిభాగం పరిధిలోని ఫూలియా ఖుర్ద్ గ్రామ పంచాయతీలో ఈ ఎన్నికలు జరిగాయి. పవన్ సాహుకు యూట్యూబ్‌లో 27.7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన రీల్స్‌కు భారీగా వ్యూస్ వస్తుంటాయి. అయితే, డిజిటల్ పాపులారిటీ ఎన్ని్కల్లో పనికిరాదని మరోసారి తేలింది.

ఈ ఎన్నికల్లో భగవతి లాల్ సోనీ 1,203 ఓట్లతో సర్పంచ్‌గా విజయం సాధించారు. మాజీ సర్పంచ్ కాలురామ్ 797 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పవన్ సాహు భార్య కోమల్ సాహు 277 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. పారిశుద్ధ్యం, మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, విద్య, యువత భవిష్యత్ వంటి హామీలు ఇచ్చినా పవన్ భార్యకు పరాజయమే మిగిలింది.

పవన్ సాహూ తన భార్య కోమల్‌ను బరిలోకి దింపి ,స్వయంగా ప్రచారం నిర్వహించారు. ‘‘నా గ్రామ.. నా గుర్తింపు’’ అనే నినాదంతో ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రచారానికి ‘మిషన్ 2026’గా పేరు పెట్టారు. పవన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా పాపులారిటీ, రాజకీయ మద్దతు మధ్య చాలా తేడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు అభ్యర్థి వ్యక్తిగత గుర్తింపు, స్థానిక ప్రజలతో అనుబంధం, సమస్యల అవగాహనపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.