ప్రతీకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తమిళనాడు. గత నలబై ఏళ్ల నుంచి తమిళ నాట రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ కొత్త సీఎం దానికి ముగింపు పలికినట్టే కనిపిస్తోంది. పనికి రాని పనులు మాని రాష్ట్ర పురోగతిపై ఫోకస్ పెట్టారు సీఎం ఎం కే స్టాలిన్. ప్రస్తుతం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయ సంచలనంగా మారుతోంది. అదే సమయంలో ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని అభినందిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ జాబితాలో చేరారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన వ్యవహరిస్తున్న తీరును జనసేన అధినేత అభినందించారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ కల్యాన్ ట్వీట్ చేశారు.
అందరినీ ఇంతలా ఆకర్షిస్తున్న స్టాలిన్ ఇంతకూ ఏ నిర్ణయాలు తీసుకున్నారు.. సిఎం పదవి చేపట్టిన తరువాత ఆయన తీసుకున్న మొదటి సంచలన నిర్ణయం అంతర్జాతీయ స్థాయి నిపుణులను ఆర్థిక సలహాదారులుగా పెట్టుకోవటం. అధికారంలోకి వచ్చీ రాగానే అభివృద్ధిపై ఫోకస్ పెడతూ అర్ధిక సలహా మండలి ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ , నోబెల్ విజేత ఎస్తేర్ డుఫ్లో సహా ఐదుగురు ఆర్ధికవేత్తలు సభ్యులు. వీరు ఆర్ధిక, సామాజిక విధానాలపై సీఎంకి సలహాలు, సూచనలు చేస్తారు. అలాగే అన్ని రంగాలలో ఆర్ధిక, సామాజిక విధానాలు, సామాజిక న్యాయం, మానవాభివృద్ధి సంబంధిత అంశాలు, ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలకు సమానావకాశాలపై సాధారణ మార్గదర్శకాలను ఈ కౌన్సిల్ అందజేయనుంది. అన్ని రంగాల్లోనూ వృద్ధి, ఉద్యోగకల్పన, ఉత్పత్తి పెంపునకు సలహాలు, అలాగే అభివృద్ధి నిరోధకాలకు పరిష్కారాలను సూచించే బోర్డుగానూ వ్యవహరించనుంది. ఇప్పటికే తమిళనాడులో దీని ఫలితం కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ రేట్లు మండిపోతున్న వేళ స్టాలిన్ సర్కార్ లీటర్ పెట్రోల్ పై మూడు రూపాయల తగ్గించటం విశేషం.
స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తీసుకున్న మరో సంచలన నిర్ణయం అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కంటిన్యూ చేయటం. ఇది అన్నా డీఎంకే నే కాకు స్టాలిన్ సొంత పార్టీ డీఎంకే నాయకులకు కూడా పెద్ద షాక్. ప్రజలకయితే ఇంకా పెద్ద షాక్. తమిళనాట ఇలాంటి నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ స్టాలిన్ దాని జోలికి పోదల్చుకోలేదు. జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను యధావిధిగా కొనసాగిస్తారు. అలాగే కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలోనూ విపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
స్టాలిన్ తీసుకున్న మరో సాహసోపేత నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్ కల్పించటం. ఈ నిర్ణయం విశేష జనామోదం పొందుతోంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ప్రతిపక్ష AIADMK కూడా ఆమోదం తెలపటం మరో విశేషం. ఈ బిల్లు ప్రకారం..యూనివర్సిటీల్లోని వెటర్నరీ సైన్సెస్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ వంటి వృత్తిపరమైన కోర్సుల్లో అన్ని కేటగరీల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 7.5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. చాలా ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు..ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులతో పోటీ పడుతూ సామాజిక-ఆర్ధిక అసమానతల కారణంగా కావల్సిన కోర్సుల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామాల్నించి వచ్చే విద్యార్ధులు, డబ్బులేని విద్యార్ధులకు ఇదో మంచి అవకాశం.
ఇటీవల స్టాలిన్ తీసుకున్న ఓ నిర్ణయ్ రాజకీయాల్లో పెను దుమారం లేపుతోంది. పొగడ్తలు ఇష్టపడని రాజకీయ నాయకుడు ఉంటాడా మన దేశంలో. ఎంత పొగిడితే అంత. అన్నట్టు నడుస్తున్నాయి ఇండియన్ పాలిటిక్స్. కానీ దీనికీ చెక్ పెట్టారు సీఎం స్టాలిన్. పొగడ్తలు మానకపోతే చర్యలు తప్పవని సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారాయన. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే సభ్యుడొకరు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాదురై, కరుణానిధి లను అదే పనిగా కీర్తిస్తూ స్పీచ్ అదరగొట్టాడు.. దాదాపు ఐదు నిమిషాలు స్టాలిన్‌ను పొగడ్తల్లో ముంచేశాడు. దాంతో ఆయనకు చిరాకేసినట్టుంది. ఇలాంటివి తనకు నచ్చవని సభలోనే తన పార్టీ సభ్యులకు కాస్త గట్టిగానే చెప్పారు. ఇలా పొగడ్తలు నచ్చని సీఎం ఉండరనటం ఆశ్చర్యం కాదు.
స్టాలిన్ తాజాగా తీసుకున్న మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే హయాంలో పాఠశాలలకు వెళ్లే పిల్లలకు 65 లక్షల బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపుగా రూ 13 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఇప్పుడు కరోనా తరువాత స్కూళ్ల ప్రారంభం సమయంలో ఆ బ్యాగులను పంపిణీ చేయాలా వద్దా..అనే సందేహం అధికారుల్లో మొదలైంది. కారణం ఆ బ్యాగులపై జయలలిత, పళనిస్వామి బొమ్మ ఉండటమే.ప్రస్తుతం స్టాలిన్ సీఎం కావటంతో అధికారులు ఈ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఐతే ఆ 65 లక్షల బ్యాగులు ఎలా ఉన్నాయో అలాగే పిల్లలకు ఇవ్వాలని ఆదేశించారు. 13 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం కావటం ఆయనకు ఇష్టం లేదు.
స్టాలిన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాల నేపథ్యంలో ఏపీ మీద ఓ లుక్కేద్దాం. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఆరోగ్య సేవలతో పాటుగా అనేక పథకాలకు ఎన్టీఆర్..కొన్నింటికి చంద్రబాబు పేరు పెట్టారు. ఐతే వైసీపీ పవర్ లోకి వచ్చాక బాబు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పేరు మారింది. జగన్ రాకతో మళ్లీ పాత పేరు పెట్టారు. ఇక చంద్రబాబు హాయంలో ఆడపిల్లలకు సైకిళ్లు ఇవ్వాలనే నిర్ణయించి..కొనుగోలు చేసిన సైకిళ్లను సైతం వైసీపీ ప్రభుత్వం వినియోగించలేదు. ఏదేమైనా స్టాలిన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. చూడాలి ఆయన భవిష్యత్‌లో రాజకీయంగా ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారో!!
