Site icon NTV Telugu

Delhi: 2024 ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

Ec Press Meet

Ec Press Meet

త్వరలో దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

పార్లమెంట్ (Parliamentary), అలాగే ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (State Assembly Elections) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని (EC) వెల్లడించారు. దేశ వ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాజీవ్ కుమార్  (Rajiv Kumar)చెప్పుకొచ్చారు.

ఒడిశా అసెంబ్లీపై..
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 50% పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. 22,685 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 300 పోలింగ్ స్టేషన్లు వికలాంగుల కోసం ఏర్పాటు చేసినట్లు రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు.

వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ.. ఇంకోవైపు ఇండియా కూటమి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కమలనాథులు సమావేశమయ్యారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలుపొందడం కోసం ఏం చేయాలన్నదానిపై మేథోమదనం చేస్తున్నారు. ఇప్పటికే మోడీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇంకోవైపు విపక్ష పార్టీలు కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. కానీ.. వారిలో ఐక్యత లోపించింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తు్న్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిలో ఉన్న కూడా సొంతంగా బరిలోకి దిగుతున్నారు. దీంతో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడ్డ కూటమి కాస్తా బలహీనపడింది. ఇండియా కూటమిలోని అనైక్యతను క్యా్ష్ చేసుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

ఇక కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ యాత్ర కాంగ్రెస్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి.

 

 

Exit mobile version