NTV Telugu Site icon

Palitana: దేశంలో పూర్తి “శాకాహార నగరం”గా గుర్తింపు.. మాంసాహరం నిషేధానికి కారణం ఏంటీ..?

Palitana

Palitana

Palitana: ప్రపంచంలోనే భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లకు భారతదేశం కేంద్రం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా ఆచార వ్యవహారాలు ఉంటాయి. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆహార నియమాలు, అలవాట్లు ఉంటాయి. ప్రపంచ అట్లాస్ నివేదిక ప్రకారం, భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక శాకాహారులు ఉన్న దేశంగా నిలిచింది. దేశంలో 38 శాతం మంది శాకాహారులు ఉన్నారు. ఇదిలా ఉంటే, దేశంలోనే పూర్తి ‘‘శాకాహార’’ నగరంగా గుజరాత్ లోని ‘పాలిటానా’ రికార్డుకెక్కింది. ఈ పట్టణంలో పూర్తిగా మాంసాహారం నిషేధం. ఈ పట్టణం గుజరాత్‌లోని భావ్ నగర్ జిల్లాలో ఉంది. మాంసం, గుడ్లతో పాటు మాంసాహారం ఈ పట్టణంలో పూర్తిగా నిషేధం.

Read Also: London: భారత్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం..లండన్ లో ఇలా ఎందుకు జరగదు?

ఈ ప్రాంతంలో జైన సన్యాసులు మాంసాహార నిషేధం కోసం పెద్ద ఉద్యమమే చేశారు. 2014లో, ఈ ప్రాంతంలో దాదాపుగా 250 మాంసం దుకాణాలనున మూసేయాలని కోరుతూ 200 మంది సన్యాసులు నిరాహారదీక్ష చేశారు. జైన మతస్తుల మనోభావాలను గౌరవించేందు ఈ ప్రాంతంలో మాంసం, గుడ్లు, జంతువులను వధించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇవి ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తుంది.

ఆలయాల నగరంలో పాలిటానాకు పేరుంది. ఇక్కడి త్రుంజయ కొండపై 900 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతున్న 800 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. పాలిటానాలో లభించే ఆహారం పూర్తిగా జైన వంటకాల నుంచి ప్రేరణ పొందింది. జైన వంటకాల్లో కొన్ని కూరగాయలను కూడా మినహాయిస్తారు. పాలిటానాలో సులువుగా దొరికే ప్రసిద్ధ వంటకాలలో ధోక్లా, ఖాండ్వీ, గతియా మరియు కధి ఉన్నాయి. ప్రజలు మిల్లెట్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తృణధాన్యాలు, బెల్లం, నెయ్యి ఉపయోగించి ‘రోట్లో’ అనే పదార్థాన్ని తయారు చేస్తారు.