Site icon NTV Telugu

Tamilnadu: పన్నీర్ సెల్వంకు మరో షాక్.. 18 మందిపై బహిష్కరణ వేటు

Palaniswami

Palaniswami

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన అన్నాడీఎంకే.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వంను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి బహిష్కరణ వేటు వేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వీరంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పళనిస్వామి చెప్పారు.

పన్నీర్​ సెల్వం కుమారుల్లో ఒకరు రవీంద్రనాథ్​ తేని నియోజకవర్గం నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమారుడు జయప్రదీప్​, మాజీ మంత్రి ఎన్​ నటరాజన్‌పైనా పార్టీ వేటు వేసింది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. వీరంతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని, అన్నాడీఎంకేకు చెడ్డ పేరు తెచ్చారని ఓ ప్రకటనలో పళనిస్వామి తెలిపారు. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు.

Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు

కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్‌ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. పన్నీర్ సెల్వంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర‍్ణయం తీసుకుంది.

Exit mobile version