Pakistan: భారతదేశాన్ని ఇన్నాళ్లు పాకిస్తాన్ ‘‘అణు బెదిరింపులకు’’ పాల్పడేది. అయితే, ఆపరేషన్ సిందూర్‌తో ఈ పరిస్థితిని భారత్ మార్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల్ని దేశంపై యుద్ధంగానే చూస్తామని, ఇకపై అణు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంగా పాకిస్తాన్‌కు తెలియజేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ అణ్వాయుధాలకు కేంద్రంగా ఉన్న పలు ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ అంటే ఏమిటో పాకిస్తాన్‌కు తెలిసొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. దేశ అణుకార్యక్రమాలు పూర్తిగా ‘‘శాంతియుత ప్రయోజనాలు, ఆత్మరక్షణ’’ కోసమని చెప్పారు. దురాక్రమణ కోసం కాదని అన్నారు. ప్రతీసారి, భారత్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భారత్ తమపై దాడి చేయకముందు పాకిస్తాన్ నేతలు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడేవారు. తాజాగా, షరీఫ్ ప్రకటన చూస్తే ఇక భవిష్యత్తులో భారత్‌ని అణుముప్పుతో భయపెట్టలేమనేది స్పష్టంగా సూచిస్తుంది.
Read Also: US-China War: చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, జపాన్-ఆస్ట్రేలియాతో అమెరికా..
పాకిస్తాన్ విద్యార్థులతో మాట్లాడిని షరీఫ్, శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ‘‘సాంప్రదాయ, అణు శక్తి పూర్తి స్పెక్ట్రమ్’’ ఉపయోగించాలని ఒక సీనియర్ పాకిస్తాన్ దౌత్యవేత్త హెచ్చరించిన రెండు నెలల్లోపే పాక్ ప్రధాని నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌పై జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం సైనిక ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ కారణంగా పెరిగిన ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి అణు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించడంలో భాగంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇటీవల రష్యాలోని పాక్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలీ మే నెలలో రష్యన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారత్‌తో సైనిక దాడుల గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో స్పందిస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్‌లో పలు ప్రాంతాలను భారత్ టార్గెట్ చేయాలని అనుకుంటోందని, పాకిస్తాన్ నీటి సరఫరాకు అంతరాయం కలిగిస్తే అణు ప్రతీకారం చర్యలు అవసరం అవుతాయని అన్నారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేయడంతో పాకిస్తాన్ నేతలు పలుమార్లు అణు బెదిరింపులకు దిగారు.
