Site icon NTV Telugu

Pakistan ISI Terror Plan: భారత్‌పై ‘సెకండ్ జనరేషన్’ ఉగ్రదాడులకు కుట్ర.. వెలుగులోకి ఐఎస్ఐ- పాక్ సైన్యం కొత్త ప్లాన్..!

Isi

Isi

Pakistan ISI Terror Plan: పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ పునరుద్ధరించేందుకు.. అలాగే, భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ‘రెండవ తరం’ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేందుకు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI), పాక్ సైన్యం భారీ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని భద్రతా సంస్థలు తాజాగా బయట పెట్టాయి. ఐఎస్ఐ ప్రస్తుతం ఉగ్రవాదంలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లాంటి పాత తరం ఉగ్రవాదుల నుంచి వారి కుమారులు, సన్నిహిత బంధువులకు నాయకత్వ బాధ్యతలను బదలాయిస్తోంది. ఉగ్రవాద సంస్థల్లో కొత్త రక్తాన్ని నింపి, కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించడమే ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: NTV journalists: సీసీఎస్ పోలీసుల హైడ్రామాకు తెర.. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌కు బెయిల్!

అయితే, ఇటీవల పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఐఎస్ఐ అధికారులు, పాక్ సైన్యం ప్రతినిధులతో పాటు వివిధ ఉగ్రవాద సంస్థల కీలక నేతల మధ్య ఉన్నత స్థాయి రహస్య సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో జమ్మూ- కాశ్మీర్‌లోకి భారీగా చొరబాట్లు చేయడం, సమన్వయంతో ఉగ్రదాడులు చేపట్టడంపై చర్చించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో లష్కరే తోయిబా నేతలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, అలాగే జైషే మహ్మద్ కమాండర్ అబ్దుర్ రవూఫ్ అస్గర్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక, తల్హా సయీద్‌ను లష్కరే తోయిబా భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. అతడికి ఉగ్రవాద భావజాలంతో పాటు సంస్థ నిర్వహణ, నిధుల సమీకరణ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు మసూద్ అజార్ సోదరుడు అబ్దుర్ రవూఫ్ అస్గర్‌కు ఐఎస్ఐ నేరుగా మద్దతు ఇస్తూ, సరిహద్దు దాడులను పర్యవేక్షించే కీలక బాధ్యతలను అప్పగించినట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్‌ సిరాజ్‌!

ఇక, లష్కరే తోయిబా ప్రధాన కేంద్రమైన మురిడ్కేలోని ‘మర్కజ్-ఏ-తైబా’ మళ్లీ పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మారింది. గతంలో దెబ్బతిన్న భవనాలను పాక్ సైన్యం, ఐఎస్ఐ నిధులతో తిరిగి నిర్మిస్తున్నాయి. ఈ నెల చివరలో శిక్షణ పూర్తి చేసుకున్న 2026 బ్యాచ్ ఉగ్రవాదులకు ‘గ్రాడ్యుయేషన్ వేడుక’ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరికి కఠినమైన సైనిక శిక్షణతో పాటు తీవ్రవాద భావజాలాన్ని లోతుగా నూరిపోస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా, అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్థాన్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు కలిసి పని చేయడం ప్రాంతీయ శాంతికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Exit mobile version