NTV Telugu Site icon

Pakistan: భారత్‌తో కుదుర్చుకున్న ‘‘లాహోర్ ఒప్పందాన్ని’’ పాక్ ఉల్లంఘించింది: నవాజ్ షరీఫ్..

Pakistan

Pakistan

Pakistan: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో హయాంలో కుదుర్చుకున్న ‘‘లాహోర్ ఒప్పందాన్ని’’ పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుతం అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) నేత నవాజ్ షరీఫ్ మంగళవారం అంగీకరించారు. 1999లో భారత ప్రధాని వాజ్‌పేయితో, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లాహోర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ‘‘ మే 28 1998న, పాకిస్తాన్ ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వాజ్‌పేయి సాహెబ్ ఇక్కడకు వచ్చి మాతో ఒప్పందం చేసుకున్నారు. కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాము.. అది మా తప్పు’’ అని పార్టీ సమావేశంలో ఆయన అన్నారు.

పాకిస్తాన్ సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన తర్వాత పీఎంఎల్-ఎన్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భారత్-పాకిస్తాన్ సంబంధాల బలోపేతానికి ప్రధాని వాజ్‌పేయి లాహోర్ పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల ప్రధానులు లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వానికి సంబంధించి ఈ ఒప్పందం జరిగింది. అయితే కొన్ని నెలల తర్వాత పాకిస్తాన్ కార్గిల్‌పై దొంగదెబ్బ తీసి కార్గిల్ యుద్ధానికి కారణమైంది.

Read Also: PM Modi: అవినీతి నేతలకు ప్రధాని మోడీ వార్నింగ్.. జూన్ 4 తర్వాత..

‘‘పాకిస్తాన్‌ను అణు పరీక్షలు చేయకుండా ఆపేందుకు ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసాడు, కానీ నేను నిరాకరించాను. ఒక వ్యక్తి (మాజీ ప్రధాని) ఇమ్రాన్ ఖాన్ నా సీటులో ఉన్నట్లయితే, అతను క్లింటన్ ఆఫర్‌ను అంగీకరించి ఉండేవాడు’’ అని పాకిస్తాన్ తన మొదటి అణుపరీక్ష నిర్వహించి 26 ఏళ్ల వార్షికోత్సం సందర్భంగా నవాజ్ షరీఫ్ ఈ రోజు అన్నారు. 2017లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాకిబ్ నిసార్ తప్పుడు కేసులో తనను ప్రధాని పదవి నుంచి ఎలా తొలంగించారనేది చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ అవాస్తవమని, అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న కేసులు నిజమని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ని అధికారంలోకి తీసుకురావడానికి 2017లో తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ జహీరుల్ ఇస్లామ్ పాత్ర గురించి కూడా ఆయన మాట్లాడారు. తనను ఐఎస్ఐ నియమించలేదనే విషయాన్ని కొట్టి పారేయాలని ఇమ్రాన్ ఖాన్‌కి సవాల్ విసిరారు. ప్రధానమంత్రి పదవికి (2014లో) రాజీనామా చేయమని జనరల్ ఇస్లాం నుండి సందేశాన్ని స్వీకరించడం గురించి మూడుసార్లు ప్రధానమంత్రి మాట్లాడారు. ‘‘నేను నిరాకరించినప్పుడు అతను నన్ను బెదిరించాడు’’ అని నవాజ్ షరీఫ్ చెప్పారు. తనకు తన తమ్ముడు, ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అండగా నిలిచారని, తమ మధ్య విబేధాలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయని, కానీ షెహబాజ్ తనకు విధేయుడని పేర్కొన్నారు.

Show comments