Thirumangai Alwar Idol: దశాబ్ధాల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని సౌందరరాజ పెరుమాళ్ ఆలయం నుంచి చోరీకి గురైన, కోట్లాది రూపాయల విలువైన కవి తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని యూకే భారత్‌కి అప్పగించనుంది. లండన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఆష్మోలియన్ మ్యూజియం నుంచి ఈ విగ్రహం తమిళనాడుకు రాబోతోంది. వివరణాత్మక దర్యాప్తు, బలమైన సాక్ష్యాల తర్వాత దానిని ఆక్స్ ఫర్డ్ తమిళనాడుకు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తమిళనాడు ఐడల్ వింగ్ సీఐడీ ధ్రువీకరించింది.
ఈ విగ్రహాన్ని 1957-1967 మధ్య దొంగిలించబడిన నాలుగు పవిత్ర విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహాలను దొంగిలించి విదేశాలకు అక్రమంగా రవాణా చేశారు. తిరుమంగై ఆళ్వార్‌తో పాటు కళింగ నర్త కృష్ణర్, విష్ణు, శ్రీదేవిల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం చివరి మూడు విగ్రహాలు అమెరికాలోని పలు మ్యూజియాల్లో గుర్తించారు. వీటిని దొంగిలించిన తర్వాత, వీటిలాగే ఉండే విగ్రహాలను ఆలయాల్లో ఉంచి,ఆలయ అర్చకులు పూజా ఆచారాలను నిర్వహిస్తున్నారు.
తమిళనాడు ఐడల్ వింగ్ సీఐడీ 2020లో తన దర్యాప్తుని ప్రారంభించింది. సాక్ష్యాధారాల సేకరణ ద్వారా విగ్రహాలను గుర్తించింది. వీరి దర్యాప్తు విదేశాల్లో ఉన్న విగ్రహాలను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి దారి తీశాయి. విగ్రహాల మూలాలను వివరించే డాక్యుమెంటేషన్ ఇందుకు సహకరించాయి. ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు ఈ సాక్ష్యాలను పరిశీలించి, కుంభకోణం నుంచి దొంగిలికి అక్రమంగా విగ్రహాలను విక్రమించినట్లు ధ్రువీకరించారు. తిరుమంగై ఆళ్వార్ విగ్రహం నెల రోజుల్లో తమిళనాడుకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఉన్న మూడు విగ్రహాలను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.