Bihar Elections: బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆర్జేడీ కూటములు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బీహార్ ప్రాంతంలో సత్తా చాటాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఐఏఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ‘‘సీమాంచల్ న్యాయ యాత్ర’’ను ప్రారంభించనున్నారు.
అయితే, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘటబంధన్‌లో చేరాలని ఓవైసీ చూశారు. కానీ, కూటమి నుంచి స్పందన రాలేదు. తాను ఆర్జేడీని మూడు సార్లు సంప్రదించినప్పటికీ ఇంకా సమాధానం రాలేదని ఓవైసీ అన్నారు. ‘‘తమ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు రెండు లేఖలు, తేజస్వి యాదవ్‌కు మూడవ లేఖ రాశారు… మేము ఆరు సీట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మాకు మంత్రివర్గం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఇంకా ఏం చేయగలం’’ అని అన్నారు.
Read Also: They Call Him OG: ఓజీ డిస్ట్రిబ్యూషన్ ఒక టార్చర్.. యూరప్ డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన
అయితే, సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎంకి సీట్లు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో దర్భంగా, మధుబనితో సహా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉందని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఐఎం విపక్ష కూటమిలో చేరితే, బీజేపీతో పోటీ హిందూ వర్సెస్ ముస్లింగా మారే అవకాశం ఉందని ఆర్జేడీ భయపడుతోంది. గతంలో 2020 ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన అమోర్, కొచాడమాన్, బైసి, జోకిహాట్, బహదూర్‌గంజ్ సీట్లు సీమాంచల్ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది.
ఈసారి ఎంఐఎం 25 సీట్లకు విస్తరించాలని చూస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఎలాంటి అవగాహన కుదరకపోతే, ఇది ముస్లింలు ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆర్జేడీ కూటమి ఓట్లకు గండి కొట్టవచ్చు. ఇది బీహార్ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. సీమాంచల్ ప్రాంతంలో కిషన్ గంజ్, అరారియ, పూర్నియా, కతిహార్ వంటి జిల్లాలు ఉన్నాయి.
