UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027కు ముందే ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలు తమ పొత్తును ప్రకటించారు. ‘సోషల్ చేంజ్ ఫ్రంట్’ పేరుతో ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నారు. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెర తీశారు. అయితే, ఈ కూటమి బీజేపీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ(ఎస్పీ), మామావతి బహూజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లలో ఎవరిని దెబ్బ కొట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దళిత, ముస్లిం ఓటర్లపై ఓవైసీ-ఆజాద్ గురి..
కొత్త కూటమి ముఖ్యంగా దళిత, ముస్లిం ఓటర్లను టార్గెట్ చేస్తోంది. యూపీ రాజకీయాల్లో దళిత, ముస్లిం ఓటర్ల వాటా కలిపి దాదాపు 40 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సామాజిక సమీకరణాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో నిర్ణయాత్మక పక్షంగా మారాలని ఇరువురు నేతలు భావిస్తున్నారు. యూపీలో ముస్లిం ప్రాబల్యం ఉన్న స్థానాలు 143, దళితులు ప్రభావం చూపే స్థానాలు 100 వరకు ఉన్నాయి. వీటిలో 85 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో ముస్లిం, దళిత ఓటర్ల మద్దతు కీలకంగా ఉండటంతో ఈ ప్రాంతాలపై ఓవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ ప్రముఖంగా దృష్టిసారించనున్నారు.
అఖిలేష్ యాదవ్‌కు ఓవైసీ టెన్షన్:
ఈ పొత్తు ముఖ్యంగా అధికార బీజేపీ కన్నా ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)కి పెద్ద పరీక్షగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్పీ ముఖ్యంగా ముస్లిం, యాదవ ఓట్లపై రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు ఓవైసీ రాకతో ముస్లిం ఓటర్లు కొత్త కూటమికి ఓటేస్తే, అఖిలేష్‌కు అధికారం అందని ద్రాక్షగా మారే అవకాశం ఉంది. ముస్లిం ఓటర్లలో 2 నుంచి 3 శాతం ఎస్పీకి దూరమైన ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఎక్కువ.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ముస్లిం, దళిత ఓటర్ల మద్దతుతో 37 స్థానాలు గెలుచుకున్నాయి. ఇదిలా ఉంటే, యూపీలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ముస్లిం ఓటర్లు సాధారణంగా బలమైన ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఎస్పీకి సానుకూల పరిణామం.
బీజేపీ హ్యాపీ..
ఓవైసీ-చంద్రశేఖర్ పోటీ యూపీలో ద్విముఖ పోటీని త్రిముఖ పోటీగా మార్చింది. ఇప్పటి వరకు బీజేపీ, ఎస్పీ కూటముల మధ్య పోటీ ఉంటుందని భావిస్తే ఇప్పుడు కొత్త పొత్తు రాకతో త్రిముఖ పోరు ఏర్పడింది. ఈ కూటమి సొంతగా ఎక్కువ స్థానాలు గెలవలేకపోయినప్పటికీ పశ్చిమ యూపీ, పూర్వాంచల్ ప్రాంతాల్లో బీఎస్పీ, ఎస్పీ ఓటు బ్యాంకును గణనీయంగా దెబ్బకొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం, దళిత ఓటర్లలో చీలిక ఏర్పడితే అంతిమంగా బీజేపీకే లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన. 2027 ఎన్నికల్లో సోషల్ చేంజ్ ఫ్రంట్ 5 నుంచి 6 శాతం ఓట్లు సాధించినా, ఇది అఖిలేష్, మాయావతి పార్టీలకు పెద్ద దెబ్బగా మారి, అంతిమంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
మాయావతి ఉనికికే ప్రమాదం..
ఒకప్పుడు యూపీలో అధికారం చెలాయించిన మాయావతి బీఎస్పీ పార్టీ, ఇప్పుడు సోదిలో లేకుండా పోయింది. చంద్రశేఖర్ అజాద్, మాయావతి ఇద్దరూ పశ్చిమ యూపీకి చెందిన వారే. ఇద్దరూ జాటవ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో, దళిత ఓటర్ల మద్దతు విషయంలో వీరి మధ్య రాజకీయ పోటీ నెలకుంటుంది. మాయావతికి సంప్రదాయంగా ఉన్న దళిత ఓటర్ల ఆజాద్ వైపు తిరిగితే బీఎస్పీ ఘోరంగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది.

