Glacial Lakes: హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లోని 400కు పైగా హిమనదీయ సరస్సులు(గ్లేసియర్ లేక్స్) విస్తరిస్తున్నట్లు తాజా రిపోర్టులో వెల్లడించింది. ఎప్పుడైనా ప్రమాదం ముంచుకురావొచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) తన తాజా పర్యవేక్షణ నివేదికలో వెల్లడించింది. జూన్ 2025కి గ్లేసియర్ సరస్సులు, నీటి వనరుల నెలవారీ పర్యవేక్షణ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో విస్తరించి ఉన్న 432 హిమనదీయ సరస్సులు ఆకస్మిక, విధ్వంసక వరదలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. వీటిపై తీవ్రమైన పర్యవేక్షణ అవసరం అని తెలిపింది. “గ్లేషియల్ లేక్ అట్లాస్ 2023 ప్రకారం భారతదేశంలో ఉన్న 432 హిమనదీయ సరస్సులు (మొత్తం 681 సరస్సుల్లో) జూన్ 2025 నెలలో నీటి వ్యాప్తి ప్రాంతంలో పెరుగుదలను చూపిస్తున్నాయి, అందువల్ల విపత్తులను నివారించడానికి తీవ్రమైన పర్యవేక్షణ అవసరం” అని నివేదిక పేర్కొంది.
Read Also: Himanta Sarma: “మదానీ ఎవరు, జైలులో పెడుతా”.. జమియత్ చీఫ్‌కి అస్సాం సీఎం వార్నింగ్..
CWC నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం హిమనదీయ సరస్సుల విస్తీర్ణం 2011 నుండి 30 శాతానికి పైగా పెరిగింది. మొత్తం వీటి విస్తీర్ణం 1,917 హెక్టార్ల నుండి 2,508 హెక్టార్లకు పెరిగింది. సరస్సుల విస్తీర్ణం పరంగా చూసుకుంటే, అరుణాచల్ ప్రదేశ్ అత్యధికంగా విస్తరిస్తున్న సరస్సులను (197) కలిగి ఉంది, తరువాత లడఖ్ (120), జమ్మూ కాశ్మీర్ (57), సిక్కిం (47), హిమాచల్ ప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5) ఉన్నాయి. మొత్తం మీద హిమాయల ప్రాంతంలో జూన్ 2025 లో 1435 హిమనదీయ సరస్సులు విస్తరించాయి.
వరదల ముప్పును తట్టుకునేందుకు దిగువ ప్రాంతాల్లోని జనావాసాలకు రియల్ టైమ్ పర్యవేక్షణ వ్యవస్థలు, శాటిలైట్ ఆధారిత హెచ్చరికలు, ముందస్తు హెచ్చరికల విధానిన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ సిఫారసు చేసింది. విస్తరిస్తున్న ఈ సరస్సులు ముఖ్యంగా దేశ సరిహద్దుల వెంబడి ఉన్నప్పటికీ, ఇవి దేశంలో ప్రవహిస్తున్న అనేక నదులకు నీటిని అందిస్తున్నాయి. దీంతో జల్ శక్తి మంత్రిత్వ శాఖ, విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారుల మధ్య సన్నిహిత సమన్వయం చేసుకోవాలని, నేపాల్, భూటాన్, చైనాలతో సరిహద్దుల మధ్య సహకారం పెంచుకోవాలని పిలపునిచ్చింది. వాతావరణ మార్పుల ఫలితంగా హిమాలయ ప్రాంతాలు పెను ముప్పును ఎదుర్కొంటున్నాయి. గ్లేసియర్లు కరిగిపోవడం, సరస్సుల విస్తీర్ణాలు పెరగడం ఆ ప్రాంత వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది.
