పహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్‌పై ఓ నీచుడు దుర్మార్గపు కామెంట్ చేశాడు. భార్యనే ఒక షూటర్‌ను నియమించుకుని చంపేసిందంటూ దారుణంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అసలే ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలు.. నీచానికి ఒడిగట్టిన వైద్య వృత్తికి చెందిన ఒసాఫ్ ఖాన్‌పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జబల్‌పూర్‌కు చెందిన ఒసాఫ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మంగళవారం పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ పక్కనే కూర్చుని భార్య దు:ఖిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఫొటోపై జబల్‌పూర్‌కు చెందిన ఒసాఫ్ ఖాన్ సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్ చేశాడు. భార్యనే షూటర్‌ను పెట్టుకుని హత్య చేయించిందని దారుణంగా కామెంట్ చేశాడు. ఆ మహిళపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందేనని.. అవకాశం వచ్చింది కాబట్టి చంపేసి ఉండొచ్చని పేర్కొన్నాడు. ఇది స్థానికులకు కోపం తెప్పించింది. దీంతో అభయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఒసాఫ్ ఖాన్ అరెస్ట్ చేశారు.
వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరాడు. ప్రస్తుతం కొచ్చిలో నేవీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 16న వివాహం జరిగింది. ఇక ఏప్రిల్ 19న గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. అనంతరం భార్యతో కలిసి పహల్గామ్ హనీమూన్‌కు వెళ్లారు. వాస్తవానికి వేరే దేశానికి వెళ్లాలని ప్లాన్ చేశారు. వీసా రాకపోవడంతో పహల్గామ్ వెళ్లారు. అలా భార్యతో కలిసి విహరిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రమూకలు విరుచుకుపడి కాల్పులకు తెగబడ్డారు. అక్కడికక్కడే వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇలా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా దు:ఖంలో ఉంటే.. కొందరు నీచులు ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
