Union Minister Pralhad Joshi: బీజేపీ మరోసారి సత్తా చాటింది. నార్త్ బెల్ట్‌లో తనకు తిరుగులేదని నిరూపించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోగా.. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకుంది. ఇక తెలంగాణ ప్రాంతంలో గతంలో పోలిస్తే ఓట్లు, సీట్లను పెంచుకుంది. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో బీజేపీ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రతిపక్షాలను ఉద్దేశించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ని అడ్డుకుంటే ఈ రోజు వచ్చిన దానికంటే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆయన హెచ్చరించారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, నియమాలు, విధానాలను అనుసరించి చర్చ జరగాలని మంత్రి ప్రహ్లద్ జోషి పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో 19 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలు పరిశీలనలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 22 వరకు జరగనున్న శీతాకాల సమావేశాల్లో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ‘క్యాష్ ఫర్ క్వేరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నుంచి వచ్చిన నివేదికను పార్లమెంట్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారం వివాదం కాబోతోంది. మరోవైపు ఐపీసీ, సీఆర్పీసీ అండ్ ఎవిడెన్స్ యాక్ట్ వంటి కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.