Margaret Alva: విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా ఈ నెల 19న ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజే ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించాయి. 80 ఏళ్ల మార్గరెట్ అల్వాకు 19 పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఆదివారం సుమారు 2 గంటల సేపు సమావేశం అయిన విపక్ష పార్టీల నేతలు మార్గరెట్ అల్వా ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో 17 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
సమావేశానంతరం ఈ భేటీలో పాల్గొన్న 17 పార్టీల నేతలు ఏకగ్రీవంగా మార్గరెట్‌ను ఎంపిక చేసినట్లు శరద్ పవార్ వెల్లడించారు.తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తమ నిర్ణయానికి మద్దతు పలికినట్టు చెప్పారు. దీంతో 19 పార్టీల మద్దతు మార్గరెట్ ఆల్వాకు లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తామంతా ఐక్యంగానే ముందుకెళ్లనున్నట్లు శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ విపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేతలు డి.రాజా, బినయ్ విశ్వసం, శివసేన నేత సంజయ్ రౌత్, టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర రావు, డీఎంకే నేతలు టీఆర్ బాలు, తిరుచ్చి శివ, ఎస్‌పీ నేతలు రామ్ గోపాల్ యాదవ్, ఎండీఎంకే నేతలు వైకో, ఆర్జేడీ నేత ఏడీ సింగ్, ఐఎంయూఎల్ నేత మొహమ్మద్ బషీర్, కేరళ కాంగ్రెస్ (ఎం) నేత జోష్ కె.మణి తదితరులు పాల్గొన్నారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ శనివారం ప్రకటించింది. తమ ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
Jagdeep Dhankhar: రేపే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ నామినేషన్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి నియామకం కోసం ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల మార్గరెట్ అల్వా ట్విటర్‌లో స్పందించారు. తనను ఎంపిక చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని.. విపక్షాల నిర్ణయాన్ని వినయంతో అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తనపట్ల విశ్వాసం ఉంచిన విపక్షాల నేతలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఆమె ట్వీట్ చేశారు.