రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందని.. మరోవైపు విపక్షాల అభ్యర్థి ఎవరోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విపక్షాలు అభ్యర్థి ఎంపిక కోసం ఇవాళ సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోనని స్వయంగా పవారే చెప్పినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి ఎవరు ? పవార్ ఒప్పుకుంటారా ? బుధవారం మమత నిర్వహించే సమావేశం తరువాత ఈవిషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విపక్షాల భేటీకి కాంగ్రెస్ కూడా హాజరవుతోంది.
ఇవాళ మమతాబెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి అతిథులు రెడీ అవుతున్నారు. శరద్‌పవార్‌ను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలిపే యోచన ఉంది. అయితే పోటీకి సుముఖంగా లేని పవార్‌ను ఒప్పించేందుకు మమత ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు మమత. తాజా రాజకీయ పరిస్థితిని చర్చించారు. అంతకుముందు పవార్ లెఫ్ట్ నేతలతో భేటీ అయ్యారు. మమత మీటింగ్‌కు హాజరయ్యేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పింది. కాంగ్రెస్ తరపున ఖర్గే, జైరామ్‌రమేష్, సూర్జేవాలా ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఎన్సీపీ నుంచి శరద్‌పవార్, ప్రఫుల్‌పటేల్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఎం నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ భిశ్వం, టీఆర్‌ఎస్ నుంచి వినోద్‌కుమార్, జగదీష్‌రెడ్డి హాజరవుతున్నారని సమాచారం. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి పవార్ అంగీకరిస్తారా? లేక వేరే అభ్యర్ధిని ప్రకటిస్తారా? మమత నిర్వహించే సమావేశం తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. విపక్షాలతో మాట్లాడేందుకు హైకమాండ్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. విపక్ష నేతలతో మాట్లాడే బాధ్యతలు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌కు అప్పగించారు. కలిసిరావాల్సిందిగా కాంగ్రెస్ సహా విపక్షాలను అడిగే ఛాన్స్ ఉంది. రాష్ట్రపతి ఎన్నికలో మెజార్టీకి స్వల్పదూరంలో ఉంది బీజేపీ. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేడీ మద్దతుతో బయటపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల నేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.
