జగదీప ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. ఊహించని రీతిలో రాజీనామా చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇంత హఠాత్తుగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద చర్చనే నడిచింది. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు ధన్‌ఖర్ ప్రకటించినప్పటికీ.. రాజీనామా వెనుక ఏదో మతలబు జరిగిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: రాజా రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. నిందితురాలిపై కొత్త పిటిషన్!
ఇదిలా ఉంటే ధన్‌ఖర్ (74) వీడ్కోలు ప్రసంగం చేయకుండానే ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలగారు. ఈ నేపథ్యంలో ధన్‌ఖర్‌కు వీడ్కోలు విందు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. వీడ్కోలు విందుకు రావాలంటూ ధన్‌ఖర్‌ను ఆహ్వానించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ వర్కింగ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో వీడ్కోలు ప్రసంగం చేయాలని ధన్‌ఖర్‌ను కోరినట్లు సమాచారం. అయితే ప్రతిపక్షాల ప్రతిపాదనను ధన్‌ఖర్ అంగీకరించరని వర్గాలు పేర్కొన్నాయి. అలా చేస్తే రాజకీయంగా మరో వివాదాస్పదం అవుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు.. నిలిచిన ప్రజా రవాణా
సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ధన్‌ఖర్ బాగానే హాజరయ్యారు. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని ధన్‌ఖర్ ఆమోదించారు. వాస్తవానికి కేంద్రమే ఈ ప్రతిపాదన తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. ఇంతలోనే ధన్‌ఖర్ తొందరపడి ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించేశారు. ఇదే కేంద్ర పెద్దలకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తప్పించాలని ప్లాన్ చేసింది. కానీ ఇంతలోనే బీజేపీ నేతలు.. ఆయన చెవుల్లో ఊదేశారు. కేంద్రం చర్యలు తీసుకోకముందే.. ముందే రాజీనామా చేసేశారు. అనారోగ్య కారణాల చేత రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ పంపారు. అయితే ఈ రాజీనామా రాజకీయంగా చాలా దుమారమే రేపింది. ఇక ఉపరాష్ట్రపతి ఎంపిక కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఈసారి పార్టీ విధేయుడికే ఆ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
