Site icon NTV Telugu

Presidential Poll: రాష్ట్రపతి ఎన్నికల రేసులో గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా..!

Mamata Min

Mamata Min

ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? అనే విషయాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకగ్రీవం ద్వారా తమ రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్డీయే ఎవరిని పెట్టినా కూడా వ్యతిరేకించి తమ పంతం నెగ్గించుకోవాలని పట్టుదలగా ఉన్నాయి విపక్షాలు. ఇందులో భాగంగా మమత బెనర్జీ నేతృత్వంలో బుధవారం విపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. 21 పార్టీలకు ఆహ్వానం అందినా 16 పార్టీల ప్రతినిధులు మాత్రమే భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా.. ఎవరిని బరిలో నిలపాలన్న అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ భేటీ అనంతరం తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రతిపక్ష పార్టీల తదుపరి సమావేశం జూన్ 21న జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. శరద్ పవార్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా మమత ప్రతిపాదించగా.. కాంగ్రెస్, శివసేన మద్దతు ప్రకటించాయి. అయితే పవార్ అందుకు సున్నితంగా నిరాకరించినట్లు తెలిసింది. తనకు ఇంకా యాక్టివ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఉందని శరద్ పవార్ అన్నట్లు తెలిసింది. మమతా బెనర్జీ మాట్లాడుతూ శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయమని మరోసారి అభ్యర్థించామని తెలిపారు. అయితే అందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. మళ్లీ ఒప్పించే ప్రయత్నం చేస్తామని.. అందుకు ఆయన ఒప్పుకోకపోతే మరో అభ్యర్థి గురించి ఆలోచిస్తామని తెలిపారు.

విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మరో ఇద్దరు పేర్లు తెరమీదకు వచ్చాయి. రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బుధవారం నాటి విపక్షాల సమావేశంలో ఫుల్ స్టాప్ పడింది. దీంతో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్లను కూడా మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీరిలో గోపాల్‌కృష్ణ గాంధీ అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు మొదటి నుంచీ ప్రతిపాదిస్తున్నాయి. శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించడంతో గాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.

జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు మమతా బెనర్జీ పిలిచిన ఈ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఐదు ప్రధాన పార్టీలు హాజరు కాలేదు. టీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం పార్టీలు సమావేశానికి దూరంగా ఉన్నాయి.

Exit mobile version