Rajya Sabha: మణిపూర్ ఘటన రాజ్యసభను కుదిపేసింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ.. అత్యాచారం.. హత్య చేసిన ఘటనపై చర్చించాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుపట్టాయి. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మే 4వ తేదీన జరిగినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో రాజస్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
Read also: Harish Rao : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వైద్య శాఖను అప్రమత్తం చేసిన మంత్రి
ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగా.. జూన్‌లో మరణించిన సిట్టింగ్ ఎంపీ హరద్వార్ దూబేకి నివాళి అర్పించిన అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ప్రకటించారు. తిరిగి 12 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్లమెంట్ వెలుపల కూడా మణిపూర్ ఘటనపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలపై సభాపక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల తీరు చూస్తుంటే పార్లమెంట్‌ను నడపకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోందని.. మణిపూర్ ఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసినా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయని చెప్పారు.
Read also: Allu Arjun: సినిమాల్లో మాత్రమే మాస్… లోపల ఒరిజినల్ అలానే ఉంది…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం తమ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ హింస అంశాన్ని లేవనెత్తాలని, ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేయాలని నాయకులు నిర్ణయించారు. తమ కూటమి ‘INDIA’ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై విపక్ష పార్టీల తొలి సమావేశం నిర్వహించాయి. మణిపూర్‌పై చర్చ చేపట్టాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. మణిపూర్ హింసపై ప్రభుత్వం నుండి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశంపై వాయిదా తీర్మానంతో నోటీసు ఇచ్చారు. దాదాపు 80 రోజులు కావస్తున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మణిపూర్ రాష్ట్రంలో పర్యటించలేదని, అక్కడి పరిస్థితులపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
‘‘మేము మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతాము. ఈ అంశాన్ని లేవనెత్తడానికి రాజ్యసభలో నోటీసు కూడా ఇచ్చాను. దానిని లేవనెత్తడానికి మాకు ఛైర్మన్ అనుమతిస్తారో లేదో మేము చూస్తాము’’ అని మల్లికార్జున ఖర్గే విలేకరులతో అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ సందర్శించడానికి సమయం ఉంది. 38 పార్టీలను (ఎన్‌డీఏ సమావేశానికి) పిలవడానికి సమయం ఉంది… కానీ మణిపూర్‌లో పర్యటించడానికి సమయం లేదా? అని మోదీని ఖర్గే ప్రశ్నించారు.