NTV Telugu Site icon

Niti aayog: మమత వ్యాఖ్యలను ఖండించిన నీతి ఆయోగ్ సీఈవో

Nitiaayogceo

Nitiaayogceo

నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ కట్ చేశారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించిన ఆరోపణలను నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్.సుబ్రహ్మణ్యం ఖండించారు. సమావేశంలో అక్షర క్రమం పాటించామన్నారు. కానీ భోజన విరామానికి ముందే మాట్లాతానని చెప్పారని గుర్తుచేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఏడు నిమిషాల సమయం ఇచ్చామని.. కానీ ఆమె అదనంగా సమయం అడిగారని పేర్కొన్నారు. మమతకు సమయం ఇవ్వలేదని అనడంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు.

ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ సమావేశం జరిగింది, సీఎం మమత ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయింది. దీంతో ఆమె సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని ఆరోపించారు. ఎన్డీయేతర ముఖ్యమంత్రుల్లో తానొక్కదాన్నే హాజరైతే.. కనీసం తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ముఖ్యమంత్రులకు మాత్రం 20 నిమిషాల సమయం ఇచ్చారని ఆరోపించారు.

ఇక మమతకు ఇండియా కూటమి నుంచి మద్దతు లభించింది. మమతకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ మద్దతు నిలుస్తూ.. ఇదేనా సమాఖ్యవాదమంటే అని నిలదీశారు. ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని చెప్పారు. శత్రువులుగా సంకీర్ణ ప్రభుత్వ భావించరాదని తెలిపారు. మమత మైక్‌ కట్‌ చేయడం కో ఆపరేటివ్‌ ఫెడరలిజమా? అని ప్రశ్నించారు.

ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఇలాగేనా గౌరవించేంది.. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని బీజేపీ గుర్తించాలని హితవు పలికారు. వారిని శత్రువులుగా చూడకూడదన్నారు. కోఆపరేటివ్‌ ఫెడరలిజం మనుగడ సాగించాలంటే చర్చలకు అవకాశం ఉండాలని సూచించారు. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని స్టాలిన్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మమత వ్యాఖ్యలను కేంద్ర పెద్దలు తోసిపుచ్చారు. లంచ్ సమయం కావడంతో మైక్ కట్ చేశారని.. అనంతరం తిరిగి మమతకు సమయం ఉంటుందని చెప్పారు. అంతేతప్ప.. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరయ్యారు.

అభివృద్ధి విషయంలో రాష్ట్రాల ప్రణాళికలు కూడా నీతి ఆయోగ్‌ శ్రద్ధగా విన్నాదని సుబ్రహ్మణ్యం తెలిపారు. కొన్ని రాష్ట్రాల సూచనలు, వారి ప్రణాళికలు చాలా బాగున్నాయన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పది రాష్ట్రాల నుంచి నీతి ఆయోగ్‌ సమావేశానికి ఎవరూ పాల్గొనలేదని సీఈవో వివరించారు.