పహల్గామ్ ఉగ్ర దాడి కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపితే.. వారి చేసిన పనికి ఇంకొందరి జీవితాలకు కష్టాలు తెచ్చి పెట్టింది. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల అధికారులు.. పాకిస్థానీయుల జాడ కోసం జల్లెడ పడుతున్నారు. ఇక అటారీ సరిహద్దు దగ్గర యూపీకి చెందిన సనా మహిళ.. పిల్లలతో వేరేపోయింది. పిల్లలేమో పాకిస్థాన్.. తల్లేమో ఇండియాలో ఉండిపోయింది. ఇలా ఒక్కొక్క దీనగాథలు బయటకొస్తున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన శారదా బాయి ఉదంతం వెలుగులోకి వచ్చింది.
శారదా బాయి అనే పాకిస్థానీయురాలు.. 35 ఏళ్ల క్రితం ఒడిశాకు చెందిన హిందూ అబ్బాయి మహేష్ కుక్రేజాతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బిడ్డలకు పెళ్లిళ్లు చేశారు.. మనవరాళ్లు ఉన్నారు. వీళ్లంతా భారతీయులు. ఇక శారదా బాయికి ఇక్కడే ఓటర్ గుర్తింపు కార్డు ఉంది. కీలక పత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. భారత్‌లోనే ఓటు హక్కు వినియోగించుకుంటోంది. కాకపోతే భారతీయ పౌరసత్వం లేదు. రాష్ట్రపతికి పిటిషన్లు పెట్టుకున్నా.. లభించలేదు.
అయితే తాజాగా శారదా బాయి ఇంటికి అధికారులు వచ్చి.. తక్షణమే పాకిస్థాన్ వెళ్లిపోవాలని సూచించారు. లేదంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. 35 ఏళ్ల నుంచి తాను ఇక్కడే ఉంటున్నానని.. హిందూ అబ్బాయినే పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. దయచేసి తన కుటుంబం నుంచి వేరే చేయొద్దని ప్రాధేయపడింది.
పెళ్లైన మొదట్లో కోరాపుట్‌లో ఉండేవాళ్లమని.. తర్వాత బోలాంగిర్‌కు వచ్చినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తనకు ఎవరూ లేరని.. పాస్‌పోర్ట్ కూడా చాలా పాతదని తెలిపింది. తనకు ఇద్దరు పిల్లలని.. మనవరాళ్లు కూడా ఉన్నారని చెప్పింది. భారతీయురాలిగా జీవించాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. దయచేసి కుటుంబం నుంచి వేరు చేయొద్దని చేతులు జోడించి బతిమాలుతున్నట్లు శారదా బాయ్ వేడుకుంది. భారతీయ పౌరసత్వం కోసం ఎన్నో సార్లు పిటిషన్లు పెట్టుకున్నానని.. కానీ లభించలేదని వాపోయింది. బోలాంగిర్ పోలీసులు హెచ్చరించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్వేగ వాతావరణం నెలకొంది.
యూపీకి చెందిన సనా అనే మహిళ కూడా 2020లో కరాచీకి చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల తల్లిదండ్రులను చూసేందుకు మీరట్ వచ్చింది. ఇంతలో పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. ఈమెకు 3 ఏళ్ల కుమారుడు, ఏడాది పాప ఉంది. పిల్లలు పాకిస్థానీయులు.. తల్లి భారతీయురాలు. అటారీ సరిహద్దు దగ్గర సనాను పాక్ వెళ్లకుండా అడ్డుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న పంపలేదు. దీంతో చేసేదేమీలేక పసిబిడ్డల్ని తండ్రికి అప్పగించి వెనుదిరిగింది. ఇలా ఒక్కొక్కరి దీనగాథలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pak-India: బోర్డర్‌లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!
