కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో.. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది ఒడిశా ప్రభుత్వం… జూన్ 1వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది.. మే 5 నుంచి అమలు చేసిన రెండు వారాల లాక్‌డౌన్ ఈ నెల 19వ తేదీతో ముగియనుండగా.. అయితే, ఆరోగ్య నిపుణులను సంప్రదించిన తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించినట్టు ప్రభుత్వం పేర్కొంది… ఒడిశాలో పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉండగా… దాదాపు రెండు వారాల లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు అది 18.2 శాతానికి తగ్గినట్టు ప్రభుత్వం చెబుతోంది.. మరోవైపు.. నిత్యావసర వస్తువుల లభ్యత కోసం ప్రభుత్వం ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇస్తూ రాగా.. ఈ సమయాన్ని ఇప్పుడు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు కుదించింది.. ఇదే సమయంలో వారాంతపు సంపూర్ణ లాక్‌డౌన్ యథావిథిగా కొనసాగుతుందని పేర్కొంది. వారాంతాల్లో కఠినమైన ఆంక్షలు ఉంటాయని.. ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మోహపాత్రా మీడియాకు వెల్లడించారు.
గతంలో పెళ్లిలకు మొత్తం 50 మందికి అనుమతి ఇస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు.. పాల్గొనేవారి సంఖ్యను వధూవరులతో సహా మొత్తం 25 మందికి తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి వ్యాప్తిని అదుపులో ఉంచడానికి సర్పంచ్‌లు, పంచాయతీ రాజ్ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. రాబోయే మూడు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించాలని.. టెస్టులు పెంచాలని నిర్ణయించింది సర్కార్.. అత్యవసర లేదా అనుమతి పొందిన కార్యకలాపాలు తప్పితే.. విద్యాసంస్థలు, అన్ని రకాల వాణిజ్య సంస్థలు, ఉత్సవాలు, సినిమా హాళ్ళు, బహిరంగ థియేటర్లు, పార్కులు, జిమ్‌లు, కటింగ్ షాపులు కూడా మూసివేయాల్సిందేనని స్పష్టం చేసింది.