Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై చైనా తన గుప్పిట్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్ అరుణాచల్ విషయంలో చైనా వైఖరిపై దృఢంగా వ్యవహరిస్తోంది. ఇటీవల డ్రాగన్ కంట్రీ అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లను మార్చింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేర్లు మార్చినంత మాత్రాన అరుణాల్ మీదైపోదంటూ ఘాటుగానే బదులిచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా భారత హోం మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనపై చైనా తన అక్కసు వెల్లగక్కుతోంది. ఆయన పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేఖించింది. ఈ ప్రాంతాన్ని సందర్శించడం అంటే బీజింగ్ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది.
Read Also: Virupaksha: తేజు గురించి డాక్టర్లు ఆ రోజే చెప్పారు: ట్రైలర్ లాంచ్ లో అల్లు అరవింద్
కాగా, చైనా అధికార ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే విధంగానే భారత నాయకులు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా పర్యటిస్తారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచల్ భారత్ లో అంతర్భాంగా, విడదీయలేని భాగంగా ఉంది, ఉంటుంది అని, ఇటువంటి పర్యటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం సహేతుకం కానది, వాస్తవాన్ని మార్చలేరని భారత్ గట్టిగానే బదులిచ్చింది.
హోం మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాలో గ్రామ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో భారత్, చైనా, మయన్మార్ ట్రై జంక్షన్ కు 40 కిలోమీటర్ల దూరంలో అమిత్ షా పర్యటించారు. ఇతర దేశాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకునే రోజులు పోయాయని, ఇప్పుడు ఓ పూచికపుల్లను కూడా తీసుకోలేరని పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ భాగాన్ని దక్షిణ టిబెట్ లో అంతర్భాగమని, జాంగ్నాన్ పేరుతో పిలుస్తోంది.