NTV Telugu Site icon

NVS-02 satellite: ఇస్రోకి ఎదురుదెబ్బ.. నిర్ధేశిత కక్ష్యలోకి చేరని NVS-02 ఉపగ్రహం

Isro

Isro

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 29న శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్ కింద ఎన్వీఎస్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీన్ని జనవరి 29న GSLV-Mk 2 రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారత అంతరిక్ష-ఆధారిత నావిగేషన్ వ్యవస్థకు NVS-02 ఉపగ్రహం కీలకం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (నావిక్)లో కీలకమైనది. అయితే ఇప్పుడు ఇస్రోకు ఎదురు దెబ్బ తగిలింది. అంతరిక్ష నౌకలోని థ్రస్టర్ లు పనిచేయకపోవడంతో NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి ఇస్రో చేసిన ప్రయత్రాలు విఫలమయ్యాయి.

దీనికి గల కారణం శాటిలైట్ లోని ఇంజిన్లు ప్రజ్వరిల్లకపోవడమే. స్పేస్‌క్రాఫ్ట్‌లో అమర్చిన థ్రస్టర్‌లు పనిచేయకపోవడంతో ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్థేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నం విజయవంతం కాలేదని ఇస్రో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. శాటిలైట్ ప్రస్తుతం నావిగేషన్ వ్యవస్థకు అనుకూలించని ధీర్ఘవృత్తాకార జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ లో భూమి చుట్టు తిరుగుతోంది.

NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. NVS-02 ఉపగ్రహం భారత్ తదుపరి తరం NavIC వ్యవస్థలో రెండవ ఉపగ్రహం. ఇది భారత్ లోని ప్రజలకు భారత భూభాగం నుంచి 1,500 కి.మీ వరకు ఉన్న ప్రాంతాలకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయ డేటాను అందించడానికి రూపొందించబడింది.