NTV Telugu Site icon

Nupur Sharma: నుపుర్ శర్మ వీడియో చూస్తున్న వ్యక్తిపై దాడి.. ఆరుసార్లు కత్తితో పొడిచిన దుండగులు

Nupur Sharma

Nupur Sharma

Nupur Sharma- Prophet Row: దేశవ్యాప్తంగా నుపుర్ శర్శ వివాదం సంచలన రేపుతోంది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత కామెంట్స్ చేసిన నుపుర్ శర్మపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు కొంతమంది మతోన్మాదులు నుపుర్ శర్మను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇటీవల నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన ఇద్దరు వ్యక్తుల్ని దారుణంగా చంపేయడం కలకలం రేపింది. ఉదయ్ పూర్, అమరావతి ఘటనలు మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రంలోని సీతామర్హిలో ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. నుపుర్ శర్మ వీడియోను చూస్తున్న వ్యక్తిని కొంతమంది దుండగులు చంపేందుకు ప్రయత్నించారు. పరిగెత్తిస్తూ కత్తితో దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాధితుడిని సీతామర్హి ప్రాంతానికి చెందిన అంకిత్ ఝా(23)గా గుర్తించారు. ఈ దాడిలో అంకిత్ ఝా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జూలై 16న జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు వీరిలో నాన్ పూర్ గ్రామానికి చెందిన గౌరా అలియాస్ మహ్మద్ నిహాల్, మహ్మద్ బిలాల్ గా గుర్తించారు.

Read Also: Nupur Sharma: నుపుర్ శర్మను చంపేందుకు కుట్ర.. సరిహద్దు దాటిన పాకిస్తాన్ వ్యక్తి

అంకిత్ ఝా పాన్ షాప్ వద్ద నిలబడి నుపుర్ శర్మ వీడియో చూస్తున్న క్రమంలో అక్కడే సిగరెట్ తాగుతున్న వ్యక్తితో వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తర్వాత నిందితుడు అతని అనుచరులతో వచ్చి అంకిత్ పై ఆరుసార్లు కత్తిలో పొడిచారు. ప్రస్తుతం అంకిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తుపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు నుపుర్ శర్మ అంశానికి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే అంకిత్ ఝా కుటుంబ సభ్యులు మాత్రం నుపుర్ శర్మ వీడియో చూస్తున్న సమయంలోనే దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. దాడికి సంబంధించి నుపుర్ శర్మ కేసు గురించి ఫిర్యాదులో నమోదు చేశామని.. ఆ తరువాత పోలీసులు దానిని మార్చారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో ఫిర్యాదులో నుపుర్ శర్మ పేరును తొలగించారని ఆరోపిస్తున్నారు. ప్రధాన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నుపుర్ శర్మకు మద్దతు తెలిపారని ఇటీవల ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా తల నరికి హత్య చేశారు. దీని కన్నా ముందుగా మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని కూడా ఇదే విధంగా చంపేశారు. ఈ రెండు ఘటనలపై ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.