NTV Telugu Site icon

BJP: రాహుల్ గాంధీని కులం అడిగితే తప్పేంటి..? ఆయన అదే పనిచేస్తున్నారు కదా..

Bjp

Bjp

BJP: లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పరోక్షంగా ఉద్దేశిస్తూ చేసిన ‘‘కులం’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా విమర్శలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్‌కి ఎస్పీ వంటి ఇండియా కూటమి పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. మంగళవారం సభలో ఠాకూర్ మాట్లాడుతూ..‘‘కులం తెలియనివారు కులగణన గురించి మాట్లాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోడీ మద్దతుగా నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధానికి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే, ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కులం అడగడంలో తప్పు లేదని, అదే పని చేస్తూ ఆయన కుల ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఠాకూర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కులాన్ని అడగటం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని విభజించే కుట్ర పన్నిందని, రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడినప్పుడు చాలా నిరసనలు వ్యక్తమవుతున్నాయని రిజిజు అన్నారు.

Read Also: Pakistan: F-16 యుద్ధ విమానాలను నడపలేని స్థితిలో పాక్.. ఆర్థిక ఇబ్బందులతో వ్యూహాత్మక చిక్కులు..

పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడిన కిరణ్ రిజిజు..‘‘ కాంగ్రెస్ ప్రతీ రోజు కులం గురించి మాట్లాడుతుంది, అతను (రాహుల్ గాంధీ) మీడియా ప్రతినిధులను కలిసినప్పుడు వారి కులం అడుగుతాడు, అతను సాయుధ బలగాల కులాన్ని అడుగుతాడు, భారత్ జోడో యాత్రలో అతను ప్రజల కులం అడుగుతాడు. వారు ప్రజల కులం గురించి అడగవచ్చు, కానీ అతని కులం గురించి ఎవరూ అడగొద్దు.. ఏంటి ఇది? అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు. వారు దేశం, పార్లమెంటు కంటే ఉన్నతమైనవారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే కుట్రగా రిజిజు అభివర్ణించారు. వీధుల నుంచి పార్లమెంట్ వరకు హింసను వ్యాప్తి చేయాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. ప్రజలను విభజించేందుకు కాంగ్రెస్ చేసే ప్రయత్నాలను బీజేపీ ఎన్నటికీ అనుమతించబోదని స్పష్టం చేశారు. ప్రధాని ఓబీసీ వర్గానికి చెందిన వారని, అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీలు ఓబీసీ, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషనర్లు వ్యతిరేకించారని అన్నారు. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న మీరు ఎందుకు కులగణన చేయలేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ప్రశ్నించారు.

Show comments