NTV Telugu Site icon

INDIA MPs: మణిపూర్‌ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయండి.. రాష్ట్రపతికి ఇండియా ఎంపీల విజ్ఞప్తి

India Mps

India Mps

INDIA MPs: మణిపూర్‌ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయాలని ప్రతిపక్ష కూటమి ఇండియా ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌ అంశంపై రాష్ట్రపతికి వివరించడానికి సమయం కోరగా ఈ రోజు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా గత మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సూచించారు. ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.మణిపూర్‌ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్రపతిని ఎంపీలు కోరారు.

Read also; KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!

రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిసిన సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్‌ (TMC) సభ్యురాలు సుస్మితా దేవ్‌ మణిపూర్‌ మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయాలని అభ్యర్థించారు. అలాగే మణిపూర్‌ ఘటనలపై పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రధాని మోడీని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు. ‘‘మణిపూర్‌లో వేర్వేరు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి సూచించాం. ఈ చర్య రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు ఉపయోగకరంగా ఉంటుందని సుస్మితా దేవ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌, జేడీయూ నాయకుడు రాజీవ్‌ రంజన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) నాయకులు అర్వింద్‌ సావంత్‌, సంజయ్‌ రౌత్‌, టీఎంసీ నాయకులు సుదీప్‌ బంధోపాధ్యాయ, డెరెక్‌ ఒబ్రెయిన్‌లు ఉన్నారు.