Congress: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై నాన్చుతూనే ఉంది. మరోవైపు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే, త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 24 గంటల్లో నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అధికారాన్ని ఖర్గేకి ఇచ్చిందిన పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు. ఎవరూ భయపడొద్దని, ఎవరూ పారిపోవడం లేదని ఆయన అన్నారు.
అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం విడుదల చేసిన తాజా లోక్‌సభ ఎన్నికల జాబితాలో అభ్యర్థులను పేర్కొనకుండా కాంగ్రెస్ సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. అయితే, ఈ సారి మళ్లీ అతను అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐదో దశలో మే 20న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్, ప్రియాంకా ఎవరు పోటీ చేసిన ఓడిపోతారని ఆమె చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 ఎంపీ స్థానాలు ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 63 స్థానాల్లో సమాజ్ వాదీ, ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి.