అన్‌పార్లమెంటరీ పదాల జాబితాపై తీవ్ర రాజకీయం దుమారం లేవడంతో దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా స్పష్టతనిచ్చారు. పార్లమెంట్‌లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధించబడలేదని, సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని తెలిపారు. లోక్‌సభ సెక్రటేరియట్‌లో ‘సిగ్గు’, ‘జుమ్లాజీవి’, ‘తానాషా’, ‘దుర్వినియోగం’, ‘ద్రోహం’, ‘అవినీతి’, ‘నాటకం’ వంటి పదాల జాబితాతో కూడిన బుక్‌లెట్‌ను ప్రచురించడంపై వివాదాస్పదమైన నేపథ్యంలో బిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘గతంలో అన్‌పార్లమెంటరీ పదాల జాబితాను పుస్తకం రూపంలో విడుదల చేసేవారు. పేపర్లు వృథా కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌లో పెట్టాం. ఎలాంటి పదాలను నిషేధించలేదు, తొలగించిన పదాల సంకలనాన్ని విడుదల చేశాం.” అని లోక్‌సభ స్పీకర్ బిర్లా స్పష్టతనిచ్చారు. ఏ పదం నిషేధించబడలేదు. సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛగా ఉన్నారు. ఆ హక్కును ఎవరూ లాక్కోలేరు, కానీ అది పార్లమెంటు పద్ధతి ప్రకారం ఉండాలి అని బిర్లా అన్నారు. తొలగింపు కోసం ఎంచుకున్న పదాలను అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఉపయోగిస్తున్నారని, ప్రతిపక్షాలు మాత్రమే ఉపయోగించే పదాలను సెలెక్టివ్‌గా తొలగించ లేదని, నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని విపక్షాలను ఆయన కోరారు.
Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర
పార్లమెంటరీ పద్ధతుల గురించి తెలియని వ్యక్తులు అన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నారని బిర్లా అన్నారు. చట్టసభలు ప్రభుత్వం నుండి స్వతంత్రంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. ఇది 1959 నుండి ఒక సాధారణ అభ్యాసంలాగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. అన్‌పార్లమెంటరీగా భావించే పదాలు, వ్యక్తీకరణల జాబితాలను సంకలనం చేసే బుక్‌లెట్ విడుదలను ప్రస్తావిస్తూ స్పీకర్ ఈ విధంగా వెల్లడించారు. లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన కొత్త బుక్‌లెట్ ప్రకారం.. ‘జుమ్లజీవి, దోహ్రా చరిత్ర, బాల్ బుద్ధి, స్నూప్‌గేట్’ వంటి పదాలు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ‘అన్‌పార్లమెంటరీ పదాలు’గా ప్రకటించబడ్డాయి. వీటితోపాటు ‘అరాచకవాది, శకుని, తనషా, తానాషాహి, నియంతృత్వం, జైచంద్, ఖలిస్తానీ, వినాష్ పురుష్, ఖూన్ సే ఖేతీ వంటి పదాలు కూడా కొత్త బుక్‌లెట్‌లో చేర్చబడ్డాయి. ఈ విధమైన పదాలు చట్టసభల్లో ప్రయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగించడం జరుగుతుంది.