Gyanvapi Case: జ్ఞానవాపీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసి కోర్టు దక్షిణ సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పూజలు కొనసాగించేందుకే హైకోర్టు మొగ్గు చూపించడంతో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తాకినట్లైంది.
మసీదు కమిటీ అంజుమన్ ఇంతేజామియా దాఖలు చేసిన పిటిషన్‌ని శుక్రవారం అలహాబాద్ హైకోర్టు విచారించి, ఈ మేరకు పూజల్ని నిలిపివేసేందుకు అనుమతించ లేదు. జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణం లోపల మరియు వెలుపల శాంతిభద్రతలను నిర్వహించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.
Read Also: Bride With Boyfriend: బ్యూటీ పార్లర్ నుంచి బాయ్ ఫ్రెండ్‌తో వధువు జంప్..! వరుడు పరిస్థితి..?
జ్ఞానవాపి దక్షిణ సెల్లార్ లో పూజలు నిర్వహించేందుకు వారణాసి కోర్టు అనుమతించడంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. విచారణ సందర్భంగా మసీదు కమిటి తరుపున వాదిస్తున్న న్యాయవాదులు ఎస్ఏఫ్ఏ నఖ్వీ, పునీత్ గుప్తాలు నేలమాళిగలోని వ్యాస్ కా టేఖనా(సెల్లార్)లోని నాలుగు సెల్లార్లలో ఒకదానిని హిందూ పక్షం డిమాండ్ చేస్తుందని, దానికి వారణాసి కోర్టు ఆమోదించిందని వారు హైకోర్టుకు తెలిపారు. కాగా, హిందూ పక్షం తరుపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మసీదు కమిటీ పిటిషన్‌ని వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టున మసీదులో పూజలను ఆపలేమని తీర్పు చెప్పింది.
వివాదాస్పద జ్ఞానవాపి మసీదు స్థలంలో ఇంతకుముందు ఒక దేవాలయం ఉందని మరియు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 17వ శతాబ్దంలో కూల్చివేయబడిందని హిందూ పక్షం వాదిస్తోంది. ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వేలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక్కడి మసీదుకు ముందు ఒక పెద్ద దేవాలయం ఉందని తేల్చింది. హిందూ దేవతల విగ్రహాలు, 36 దేవనాగరి, కన్నడ, తెలుగు శాసనాలు బయటపడినట్లు రిపోర్టు ఇచ్చింది.