NTV Telugu Site icon

Parliament Monsoon Session: కొత్త రాష్ట్రాల ప్రతిపాదన లేదు.. పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం

Nityananda Roy

Nityananda Roy

Parliament Monsoon Session: భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంపై ఎలాంటి ప్రతిపాదన లేదని కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్‌ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ వెల్లడించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు, అభ్యర్థనలు అందుతుంటాయని.. కానీ ఏ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిగణనలో లేదని మంత్రి తెలిపారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య 2014లో 70గా ఉందని, 2021 నాటికి 46కు పడిపోయిందని నిత్యానంద రాయ్‌ చెప్పారు.

Defence Ministry: సాయుధ బలగాల కోసం రూ.28,732 కోట్ల ప్రతిపాదనలకు రక్షణ శాఖ ఆమోదం

మరోవైపు సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఇవాళ రాజ్యసభలో 19 మంది ఎంపీలపై వేటు పడింది. అయితే ఈ సస్పెన్షన్ తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ప్రభుత్వం చర్చ నుంచి తప్పించుకుంటుందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నా, వాస్తవంలో ప్రతిపక్షాలే ఈ పని చేస్తున్నాయన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత ధరల పెరుగుదల అంశంపై చర్చిస్తామన్నారు. ఎన్నో దేశాలతో పోల్చుకుంటే భారత్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో మెరుగ్గా వ్యవహరించిందన్నారు. కాగా.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.