Site icon NTV Telugu

Corona : ఇక నెగిటివ్‌ రిపోర్ట్‌ అవసరం లేదు.. కానీ..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతుండడంతో దేశంలో థర్డ్‌ వేవ్‌ సృష్టించింది. దీంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలు సైతం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. కోవిడ్‌ తీవ్రత ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లను తప్పనిసరి చేస్తూ కోవిడ్‌ నిబంధనలు జారీ చేశాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేరళ, గోవా నుండి వచ్చే ప్రయాణికుల తప్పనిసరి ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ ఉండాలన్న షరతును కర్ణాటక ప్రభుత్వం ఎత్తివేసింది. “అన్ని రకాల రవాణా మార్గాల ద్వారా కేరళ, గోవా నుండి కర్ణాటకకు వచ్చే ప్రయాణీకులకు ఇకపై ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ అవసరం లేదు” అని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ ట్వీట్ చేశారు.

అయితే ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని మంత్రి తెలిపారు. డిసెంబర్ 2021 చివరి వారం నుండి ప్రారంభమైన కోవిడ్ -19 థర్డ్‌ వేవ్ తరువాత, ప్రభుత్వం నిబంధనలను విధించింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ డబుల్ డోస్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరిగా చేసింది. “ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లతో పోలిస్తే తగ్గుతున్న కేసులు, తక్కువ ఆసుపత్రిలో చేరడం, తక్కువ మరణాల తరువాత, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది” అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Exit mobile version