New Toll System: ఇకపై టోల్ గేట్ దగ్గర ఆగక్కర లేదు. టోల్ గేట్ దగ్గర ఆగకుండా ఉండేలా కొత్త టోల్ వ్యవస్థ త్వరలో రాబోతోంది. ఇందుకు సంబంధించి కొత్త టోల్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆగిన విధంగా కాకుండా ఇకపై 30 సెకండ్ల లోపుగానే టోల్ నుంచి బయటపడేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు. కొత్త టోల్ వ్యవస్థతో జాతీయ రహదారుల దగ్గర ఇకపై వాహనదారులు ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇక పండుగలు ఇతర సమయాల్లోనూ గంటల తరబడి టోల్ దగ్గర వెయిటింగ్ బాధ తప్పనుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అవరోధం లేని టోల్ వ్యవస్థ కోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే, దానిని అమలు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్ బూత్‌ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందన్నారు.
Read also: Odisha Train Tragedy: గుర్తించలేని స్థితిలో ఇంకా 29 మృతదేహాలు.. ఏం చేయనున్నారు..?
ఇకపై కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపుల వ్యవస్థకు ఉండొచ్చని తెలిపారు. గతంలో ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద వారి వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. వారు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాం సహా అన్ని రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి అంతా జరుగుతోందని, టెలికమ్యూనికేషన్స్ రంగం ఇతర రంగాలతో అనుసంధానమై ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని మంత్రి స్పష్టం చేశారు.
