No Hindu Idols in Taj Mahal 22 Rooms.
దేశానికే ప్రతిష్టాత్మక కట్టడమైన తాజ్ మహల్ చుట్టు గత కొన్ని రోజులు పుకార్లు షికార్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజ్‌మహల్ కట్టకముందు అక్కడ శివాలయం ఉండేదని, ఆ శివాలయంకు సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ.. అంతేకాకుండా తాజ్ మహల్‌లో మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అందుకే ఆ గదులను తెరవాలంటూ.. అయోధ్య బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ డాక్టర్ రజనీష్ కుమార్ మే నెలలో అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ కోర్టు ఎలాంటి ఆధారాణలు లేకుండా పిటిషన్‌ను దాఖలు చేయడంపై మండిపడింది. అంతేకాకుండా పురావస్తు శాఖ నేతృత్వంలో తాజ్ మహల్‌లోని గదులు తెరవాలంటూ ఆదేశాలు జారీ చేయాలని అలహాబాద్ హైకోర్టు కోరగా తోసిపుచ్చింది.
అయితే.. ఈ క్రమంలో.. సమాచార హక్కు చట్టం ద్వారా గత నెల 21న టీఎంసీ నేత సాకేత్ గోఖలే పురావస్తు శాఖను ఆశ్రయించారు. తాజ్‌మహల్ నిర్మించిన భూమి ఏదైనా ఆలయానికి చెందినదా? తాజ్‌మహల్ నేలమాళిగలో మూసివున్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా? అంటూ ఆయన ప్రశ్నలతో కూడిన పిటిషన్‌ను పురావస్తు శాఖకు పంపడంతో.. స్పందించిన పురావస్తు శాఖ.. తాజ్‌మహల్ నేలమాళిగలో అసలు మూసివున్న గదులే లేవని, తాజ్‌మహల్ నిర్మించిన ప్రదేశం ఏ ఆలయానికి చెందినది కాదని తేల్చేసింది.