NTV Telugu Site icon

Randhir Jaiswal: ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు.. మరోసారి పాక్‌కు తేల్చిచెప్పిన భారత్

Randhirjaiswal

Randhirjaiswal

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఇరాన్‌లో పర్యటిస్తూ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శాంతి కోరుకునే వాళ్లు చర్చలకు రావాలంటూ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Pakistan: ‘‘అవును, భారత్ బ్రహ్మోస్‌తో మా ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది’’..ఒప్పుకున్న పాక్ ప్రధాని..

తాజాగా భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని.. పాకిస్థాన్‌ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని తేల్చిచెప్పారు. పాకిస్థాన్ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు. ఏవైనా సంబంధాలు ద్వైపాక్షికంగా ఉండాలన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని మరోసారి తేల్చి చెప్పారు. తాము అందించిన రికార్డుల ప్రకారం ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశారు. పీవోకేను అప్పగిస్తేనే.. పాకిస్థాన్‌తో చర్చలుంటాయని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ తిరుగులేని మద్దతిస్తోందని.. అది మానుకునే వరకు సింధు జలాలు నిలిపివేయబడుతుందన్నారు. మోడీ చెప్పినట్లుగా… ఉగ్రవాదం-వాణిజ్యం, నీరు-రక్తం కలిసి ప్రవహించలేవని చెప్పారని రణధీర్ జైస్వాల్ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Sukumar : ఆ మూడు సినిమాలు చేసి ఉంటే సినిమాలు ఆపేసేవాడిని..

ఇక ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయ పౌరుల గురించి టెహ్రాన్‌ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈనెల మొదటి వారంలో ఇరాన్‌లో తప్పిపోయినట్లు చెప్పారు. వారిని గుర్తించడం, వారి భద్రత, స్వదేశానికి తిరిగి రప్పించడం కోసం ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం వస్తోందని.. కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందించనట్లు పేర్కొన్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.