Site icon NTV Telugu

Nitish Kumar: బిహార్‌ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Nitish Kumar Take Oath

Nitish Kumar Take Oath

Nitish Kumar: బిహార్‌ మహాకూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బుధవారం పాట్నాలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి రెండోసారి షాక్‌ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పరచి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ నితీష్ చేత ప్రమాణం చేయించారు. బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్ బాధ్యతలు చేపట్టడం ఇది 8వ సారి. మహాకూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

పాట్నాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి తేజస్వీ భార్య రాజశ్రీ, మాజీ సీఎం రబ్రీ దేవి, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో నితీష్‌ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని లాలూ సమర్థించి.. ఆయనను అభినందించినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అధిష్ఠానంపై కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న నితీష్ కుమార్‌.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్నారు.

Prashant Kishor: బీహార్ పరిణామాలు.. 2024 ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

బీజేపీతో పొత్తును తెంచుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బిహార్‌లో ఏడు పార్టీల మద్దతుతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనతాదళ్-యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆర్జేడీ సహా ఏడు పార్టీలు తనకు మద్దతిస్తున్నాయని చెప్పారు. మహాఘటబంధన్‌లో స్వతంత్రులతో పాటు 164 మంది ఎమ్మెల్యేలు సహా 7 పార్టీలు ఉన్నాయని ఆయన మీడియాతో వెల్లడించారు. ఆ సమయంలో ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. 243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ కలిసి మెజారిటీని కలిగి ఉన్నాయి. జేడీయూకి 45, ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి జితన్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నితీష్ కుమార్ రాజీనామాకు ముందు హైవోల్టేజ్ రాజకీయాలకు బిహార్ వేదికైంది.

Exit mobile version