Site icon NTV Telugu

CM Nitish Kumar: విపక్షాలు అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా… నితీష్ కుమార్ కీలక హామీ

Cm Nitish Kumar

Cm Nitish Kumar

Nitish Kumar promises special status to backward states: బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక హామీ ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కాకుండా విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన అన్నారు. వచ్యే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది విపక్షాల కూటమే అని ఆయన అన్నారు. ఇటీవల ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో భాగంగా ఢిల్లీలో పర్యటించారు సీఎం నితీష్ కుమార్. ఈ పర్యటనలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర వామపక్ష పార్టీల నేతలను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు విపక్షాలు అన్నీ కలిసి పోటీ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Daniel Craig : జేమ్స్ బాండ్ చిత్రానికి మహిళల దర్శకత్వం!

బీహార్ ను విడగొట్టి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల గత రెండు దశాబ్ధాల నుంచి బీహార్ ఆదాయాన్ని కోల్పోతోందని ఆయన అన్నారు. విలువైన రెవెన్యూ, ఖనిజ సంపదను బీహార్ రాష్ట్రం కోల్పోయిందని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఏ ప్రభుత్వానికైనా కేంద్రంలో మద్దతు ఇస్తామని ప్రకటించారు.

గత నెలలో ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంది. ఎనిమిదోసారి నితీష్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య కూడా బీజేపీని ఎలా అడ్డుకోవాలనే అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది.

బుధవారం గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 మంది బీజేపీలో చేరడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. బీజేపీ డబ్బుతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తోందని విమర్శించారు. గత వారం ఢిల్లీలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎన్‌సిపికి అధినేత శరద్ పవార్‌తో సహా పలువురు ప్రతిపక్ష నాయకులను కలిశారు.

Exit mobile version