Nitin Gadkari unveils India’s first electric AC double-decker bus in Mumbai:భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఈవీ విధానాన్ని కేంద్రం తీసుకువచ్చింది. భవిష్యత్తు రవాణా రంగంలో ఈవీని ప్రోత్సహించేలా కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు పెట్రోల్, డిజిల్ ఖర్చులు పెరుగుతుండటంతో ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, కార్ల కొనుగోలు గతంలో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ లారీలు, బస్సులను మరింతగా తీసుకురావడానికి కృషి జరుగుతోంది.
Read Also: RRR : ఆస్కార్ బరిలో ‘ట్రిపుల్ ఆర్’ నిలచి, గెలిచేనా!?
తాజాా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ముంబైలో భారత మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పుల్లీ ఎయిర్ కండిషన్డ్ బస్సును ఆవిష్కరించారు. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) కొత్తగా కొనుగోలు చేసిన ఈవీ డబుల్ డెక్కర్ బస్సును గడ్కరీ ఆవిష్కరించారు. దశల వారీగా మరికొన్ని బస్సులు 2023 నాటికి ముంబై మహానగరం రోడ్లపైకి రానున్నాయి. ‘‘సుస్థిరమైన విప్లవానికి నాంది.. ఈ రోజు ముంబైలో అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని’’ ట్విట్టర్ లో నితిన్ గడ్కరీ రాసుకొచ్చారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ కు మరింత ఊతం ఇస్తుందని.. తక్కువ ఖర్చుతో కూడిన స్థిరమైన పరిష్కారాలను చూపిస్తుందని ఆయన అన్నారు. చమురు దిగుమతులను తగ్గించడం.. స్వదేశీ వనరులకు, సేవలకు ప్రోత్సహించడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్, ప్రధాని నరేంద్ మోదీ కలను సాకారం చేస్తుందని ట్విట్టర్ లో అభిప్రాయపడ్డారు.
గతంలో గడ్కరీ పార్లమెంట్ సమావేశాలకు హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్లో పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. రాబోయే కాలంలో పెట్రోల్, డిజిల్ దిగుమతులను తగ్గించడంతో పాటు విదేశీమారక నిల్వలను కాపాడుకునేందుకు భారత్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు దేశం ఏటా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి ఎలక్ట్రిక్ వాహనాలే పరిష్కారం అని కేంద్రం భావిస్తోంది.
