NTV Telugu Site icon

Nithari killings: నిఠారీ హత్యల నిందితులకు మరణశిక్ష రద్దు.. నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు..

Nithari Killings

Nithari Killings

Nithari killings: 17 ఏళ్ల క్రితం యావత్ దేశాన్ని ఓ కదుపు కదిపేసిన ‘నిఠారీ వరస హత్యల’ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నోయిడాలోని నిఠారీలో పలువురు బాలికలు, యువతులను, బాలురను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, వారిని చంపేసిన కేసులో సురేందర్ కోలీ, మానిందర్ సింగ్ పంధేర్ నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునను వెల్లడించింది. మరణశిక్ష ఎదుర్కొంటున్న వీరిద్దరినికి శిక్షను రద్దు చేసింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వీరిద్దరిని కోర్టు విడుదల చేసింది.

నిఠారీ వరుస హత్యలకు సంబంధించిన 12 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సురీందర్ కోలీని అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సహ నిందితుడు మోనీందర్ సింగ్ పంధేర్‌కు గతంలో మరణశిక్ష పడిన రెండు కేసుల్లో కూడా విముక్తి లభించింది. 9 మంది బాలికలను, ఐదుగురు యువతులను, ఇద్దరు బాలురను చంపినట్లు వీరిపై అభియోగాలు ఉన్నాయి.

Read Also:Rahul Gandhi: ప్రధాని మణిపూర్ కన్నా ఇజ్రాయిల్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కేసు వివరాలు ఇవే:

నోయిడాలోని నిఠారీ ప్రాంతంలో 2005-2006 మధ్య వరసగా హత్యలు జరిగాయి.2006లో వ్యాపారవేత్త అయిన మానిందర్ సింగ్ పంధేర్ ఇంటి సమీపంలోని ఒక మురికి కాలువలో పిల్లల ఎముకలు, అస్థిపంజరాలను పోలీసులు గుర్తించడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పంధేర్ ఇంటి వెనకాల పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడ్టాయి. ఇవన్నీ కూడా ఆ ఏడాది ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిన పిల్లలకు సంబంధించినవే అని ప్రాథమికంగా నిర్థారించారు.

ఈ కేసును తర్వాత సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో పంధేర్ ఇంటిలో పనిచేసే సురేందర్ కోలీ పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లను ఎరగా చూపి ఇంటిలోకి తీసుకెళ్లే వాడని, ఆ తరువాత అత్యాచారానికి పాల్పడి హత్యలు చేసేవారని, నరమాంస భక్షణ కూడా చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి.

సురేందర్ కోలీపై మొత్తం 16 కేసులు నమోదవ్వగా.. వాటిలో 12 కేసుల్లో మరణశిక్షను విధించింది ట్రయల్ కోర్టు. రెండు కేసుల్లో పంధేర్ కి కూడా మరణశిక్ష విధించింది. ఈ శిక్షలను గతంలో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. అయితే వీరిద్దరు కూడా ఈ మరణశిక్షలను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారించిని న్యాయస్థానం సోమవారం తీర్పును వెల్లడించింది. ఈ 14 కేసుల్లో వీరిద్దరిపై సరైన ప్రత్యక్ష ఆధారలు లేవని నిర్దోషులుగా ప్రకటించింది.