BJP: ఫాక్స్ న్యూస్ నివేదిక దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఫ్రాన్స్ అల్లర్లు, భారతదేశంలో నిరసనల వెనక ఒకే నెట్వర్క్ ఉందని ఫాక్స్ న్యూస్ సంచలన దర్యాప్తు నివేదిక పేర్కొంది. 9 దేశాల్లో 101 సంస్థలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఇవన్నీ నిరసనలకు మద్దతు ఇవ్వడం, వాటిని నిర్వహించడం, ప్రచారం చేయడంలో భాగస్వాములు అవుతున్నాయకని నివేదిక ఆరోపించింది. సీనియర్ ఎడిటర్ అస్రా నోమానీ రూపొందించిన ‘Global Chaos Inc Grows to 101 Groups’ అనే నివేదికలో ఈ నెట్‌వర్క్‌ను “రెడ్-గ్రీన్ ప్రొటెస్ట్ ఎకోసిస్టమ్”గా అభివర్ణించారు.
ఈ నివేదిక వెలువడిన తర్వాత అధికార బీజేపీ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, నివేదికలో పేరున్న వ్యాపారవేత్త నెవిల్లే రాయ్ సింగమ్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిని రెజీమ్ చేంజ్ ఆపరేషన్‌గా ఆయన అభివర్ణించారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ ఆరోపణలు చేశారు. గురువార మీడియా సమావేశంలో అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.
మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా రిపోర్టులో పేర్కొన్న ప్రొగ్రెసివ్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ సంస్థపై ఆరోపణలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 10 జన్‌పథ్‌లో ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులను కలిశారని కూడా భండారీ ఆరోపించారు. భారత్‌లో నిరసనలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకత్వం ఆ సంస్థతో సంప్రదింపులు జరిపిందా, అలాంటి సంబంధాలు రాజకీయ సందేశాలపై ప్రభావం చూపాయా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనను కూడా భండారీ ప్రశ్నించారు. నవంబర్ 1న నిరసనకు ముందు అంతర్జాతీయ సంస్థల సూచనలు తీసుకునేందుకు వెళ్లారా? అని ప్రశ్నించారు.

