Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?

  • ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పౌరపురస్కారం.. జిన్నా అనారోగ్యాన్ని రహస్యంగా ఉంచినందుకు ముంబైకి చెందిన డాక్టర్లకు అవార్డు.. ఈ రహస్యం కారణంగా సొంత దేశం ఏర్పడిందని పాక్ వాదన..
Jinnah With Gandhi

Jinnah With Gandhi

Pakistan:  పాకిస్థాన్ తన అత్యున్నత పౌర పురస్కారం ‘‘నిషాన్-ఎ-ఇమ్తియాజ్ (Nishan-e-Imtiaz)’’ను ఇద్దరు భారతీయులకు ప్రదానం చేయనుంది. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాతో వీరిద్దరికి సంబంధాలు ఉన్నాయి. ప్రాణాంతక క్షయ(టీబీ) వ్యాధితో జిన్నా బాధపడుతున్న విషయాన్ని, మరికొన్ని రోజుల్లో మరణిస్తాడనే విషయాన్ని రహస్యంగా ఉంచినందుకు గానూ ముంబైకి చెందిన ఇద్దరు పార్సీ వర్గానికి చెందిన డాక్టర్లు ఫిజీషియన్ డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్, రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ ధాయ్‌భో-కూ 2026లో ఈ అవార్డుల్ని ప్రకటించింది. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రకటించిన ఈ అవార్డుల్ని, వచ్చే ఏడాది మార్చి 23న పాకిస్తాన్ దినోత్సవం రోజున ఇవ్వనున్నారు.

జిన్నా అనారోగ్యాన్ని రహస్యంగా ఉంచినందుకేనా..?

ఆగస్టు 14న పాకిస్తాన్ మంత్రి అహ్సన్ ఇక్బాల్ సోషల్ మీడియాలో ఈ అవార్డుల గురించి వెల్లడించారు. అయితే, జిన్నా ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచడం ద్వారా వీరిద్దరు దేశ విభజనకు పరోక్షంగా సహకరించారని పాక్ భావిస్తోంది. 1946-47లోనే జిన్నా మరెంతో కాలం బతకరనే విషయం ఇద్దరు డాక్టర్లకు తెలుసు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కాంగ్రెస్‌కు కానీ, బ్రిటిష్ అధికారులకు కానీ ఈ విషయాన్ని తెలియజేయలేదు.

జిన్నా అనారోగ్యం గురించి తెలిసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవని పాక్ మంత్రి పేర్కొన్నారు. జిన్నా తీవ్ర అనారోగ్యం గురించి అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్‌కు తెలిసి ఉంటే దేశ విభజన మరింత ఆలస్యం చేసి ఉండేవారని పాక్ భావిస్తోంది.వృత్తిపరమైన గోప్యతను కాపాడటం ద్వారా కీలక సమయంలో అసాధారణ సేవ చేశారని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. తమ వైద్య ప్రమాణానికి కట్టుబడి రోగి ఆరోగ్య సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అనుకోకుండా పాకిస్థాన్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారిందని వివరించింది. పాకిస్తాన్ ఆగస్టు 14, 1947లో ఏర్పడితే, 1948 సెప్టెంబర్ 11న జిన్నా మరణించారు. కేవలం పాక్ ఏర్పడిన 13 నెలల తర్వాత చనిపోయారు.

నిషాన్-ఇ-ఇంతియాజ్ అంటే ఏమిటి..?

నిషాన్ ఇ ఇంతియాజ్ పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం. దేశానికి అత్యున్నత సేవలు అందించిన వ్యక్తులకు, అంతర్జాతీయ స్థాయిలో పాక్‌కు గౌరవం తెచ్చిన వ్యక్తులకు ఈ అవార్డును ఇస్తారు. పాకిస్థాన్‌లో హిలాల్, సితారా, తమ్ఘా వంటి ఇతర పురస్కార కేటగిరీలు కూడా ఉన్నాయి. పౌరులు, సైనిక సిబ్బంది, కొన్ని సందర్భాల్లో విదేశీయులకు కూడా నిబంధనలకు అనుగుణంగా ఈ పురస్కారాలను అందిస్తారు.

పాకిస్తాన్ ఇప్పటి వరకు 52 మందికి నిషాన్ ఇ ఇంతియాజ్ ప్రదానం చేస్తే, ఇందులో 14 మంది విదేశీయులు ఉన్నారు. భారత సినీ నటుడు దిలీప్ కుమార్‌కు కళారంగంలో సేవ చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు.