Site icon NTV Telugu

GST Council Meeting: ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

GST Council Meeting: జీఎస్టీ పరిహారం బాకాయిలు రూ.16,982 కోట్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని మండలి భావించినట్లు తెలిపారు. జూన్ నెల వరకు రాష్ట్రాలకు రూ.16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు.

పాన్ మసాలా, గుట్కా పరిశ్రమలు పన్నులను ఎగవేస్తున్నట్లు మంత్రుల బృందం మండలిలో ప్రస్తావించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ పై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ ట్రిబ్యునల్ లో ఇద్దరు న్యాయమూర్తులు ఉండాలని సభ్యులు ప్రతిపాదన చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దీనికి అధ్యక్షత వహించాలని ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి టెక్నికల్ సభ్యులకు చోటు ఇవ్వాలని సూచించారు.

ఇదిలా ఉంటే కొన్ని వస్తువులపై కౌన్సిల్ జీఎస్టీని తగ్గించింది. కంటైనర్లకు అతికించే ట్యాగ్ లు, ట్రాకింగ్ పరికరాలు, డేటా లాగర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నాకు తగ్గించారు. బెల్లం పాకంపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అయితే ముందుగా ప్యాక్ చేసి, సీల్ చేసిన బెల్లం పాకానికి జీఎస్టీ 5 శాతం ఉంటుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.

Exit mobile version