Nimisha Priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం నిమిషా ప్రియా కేసు భారత సుప్రీంకోర్టుకు చేరింది. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు అంటే, జూలై 14న అత్యవసరంగా పిటిషన్‌ను విచారించనుంది. ఉరిశిక్షను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.
జూలై 16న జరగనున్న ఆమె ఉరిశిక్షపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ అత్యవసరంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన బెంచ్ ముందు ఈ విషయం అత్యవసరంగా ప్రస్తావించబడింది. షరియా చట్టాల ప్రకారం, ‘‘బ్లడ్ మనీ’’ కింద బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే, వారు క్షమాభిక్ష పెడితే నిమిషా ప్రియాను రక్షించవచ్చనే సమాచారం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందింది.
READ ALSO: Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..
దౌత్య మార్గాల ద్వారా ఆమె విడుదలపై చర్చలు జరపడానికి కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ “సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్” ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఆ వ్యక్తికి మరణశిక్ష ఎందుకు విధించారని జస్టిస్ ధులియా ప్రశ్నించారు. స్థానిక వ్యక్తి ఆమెను హింసించడం ప్రారంభించాడని, ఆమె అనుకోని పరిస్థితుల్లో చంపేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిమిషా తన పాస్‌పోర్టు పొందేందుకు మెహదీకి మత్తు మందు ఇవ్వడం, అది విషమించడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
“సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్” 2022లో హైకోర్టును ఆశ్రయించింది. “నిమిషా ప్రియ తరపున దౌత్యపరమైన జోక్యాలను సులభతరం చేయడంతో పాటు బాధితురాలి కుటుంబంతో చర్చలు జరపాలని, అక్కడి చట్టానికి అనుగుణంగా కాలపరిమితిలో బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడాలని” కేంద్రాన్ని వేడుకుంది. అయితే, ప్రియాను కాపాడటానికి బ్లడ్ మనీపై చర్చించమని కేంద్రానికి ఆదేశం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే, ఆమె శిక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
