Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ యూనిట్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు
  • ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
  • శుక్రవారం నాసిక్ కోర్టులో హాజరు పరచనున్నారు
Nida Khan Arrested

Nida Khan Arrested

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ యూనిట్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు, మతపరమైన భావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో సంబంధిత కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ను గురువారం (మే 7) ఛత్రపతి సంభాజీనగర్లో అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్, SIT బృందం సమాచారం మేరకు, ఛత్రపతి సంభాజీనగర్ పోలీసుల సహాయంతో జాయింట్ ఆపరేషన్‌లో నిదా ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆమెను శుక్రవారం నాసిక్ కోర్టులో హాజరు పరచనున్నారు.

కేసు వివరాలు

నాసిక్ TCS యూనిట్‌లో 2022 జూలై నుంచి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో మహిళా ఉద్యోగులు (ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు) లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలకు గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. నిందితులు వ్యవస్థీకృతంగా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాలని, ప్రవర్తించాలని బలవంతపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, బుర్ఖా, రిలిజియస్ బుక్స్ ఇవ్వడం, మలేషియా పంపే ప్రయత్నాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.

నాసిక్ పోలీసులు 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, SIT ఏర్పాటు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. నిదా ఖాన్ ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన తర్వాత పరారీలో ఉండగా, దాదాపు 40 రోజుల తర్వాత అరెస్టు చేశారు. కాగా నిదా ఖాన్ తన రెండు నెలల గర్భాన్ని కారణంగా చూపి ముందస్తు బెయిల్ కోరింది. అయితే నాసిక్ కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఆమెపై IPC సెక్షన్లతో పాటు షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద కూడా సెక్షన్లు జోడించారు. TCS స్పందిస్తూ.. నిందితులను సస్పెండ్ చేసి, అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిపింది. హెరాస్‌మెంట్‌కు zero-tolerance పాలసీ ఉందని పేర్కొంది.