మహారాష్ట్రలోని అమరావతిలో మెడికల్ షాప్ యజమాని హత్య చాలా దారుణమైన ఘటన అని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అంతర్జాతీయ సంబంధాలపై కూడా పరిశీలిస్తోందన్నారు. ఈ కేసులో సూత్రధారిని పట్టుకున్నారని.. ఏదైనా అంతర్జాతీయ సంబంధం ఉందా అనేది త్వరలోనే ఎన్‌ఐఏ తేలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిని మొదట దొంగతనం కేసుగా చిత్రీకరించారని.. దానిపై కూడా విచారణ జరుగుతుందని మీడియాతో వెల్లడించారు.
మరోవైపు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ షేక్‌ను జూలై 7 వరకు అమరావతిలోని జిల్లా కోర్టు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిందితుడు ఇర్ఫాన్ షేక్‌ను ఆదివారం నాగ్‌పూర్‌లో అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో మొదట ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముదస్సిర్ అహ్మద్(22) షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫీక్(24), షోయబ్ ఖాన్ (22), అతిబ్ రషీద్(22), యూసుఫ్‌ఖాన్ బహదూర్ ఖాన్(44) పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమేష్ కోల్హే హత్య కేసులో అరెస్టైన ఏడో నిందితుడు ఇర్ఫాన్ షేక్. అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి ఆదివారం తెలిపారు.
Jammu Kashmir: టెర్రరిస్టులను పట్టించిన కాశ్మీర్ గ్రామస్తులు.. సర్వత్రా ప్రశంసలు
ఈ కేసులో సూత్రధారి అయిన ఇర్ఫాన్ షేక్‌ను శనివారం రాత్రి అరెస్టు చేశారని అమరావతి పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలిమా రాజా వెల్లడించారు. అతన్ని విచారిస్తున్నారని తెలిపారు. అతనికి రెహబర్ గ్రూప్‌లో పరిచయాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశామని.. అరెస్టుల సంఖ్య ఇంకా పెరగొచ్చన్నారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీకి చెందిన నుపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ప్రతీకారంగా మెడికల్ షాప్ యజమాని హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.